హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై అంతర్గత సర్వే | TRS Working President KTR Teleconference On HuzurNagar Bypoll | Sakshi
Sakshi News home page

50 శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌కే: కేటీఆర్‌

Oct 12 2019 4:22 PM | Updated on Oct 12 2019 6:24 PM

TRS Working President KTR Teleconference On HuzurNagar Bypoll - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల స్పందన టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శనివారం ఆయన హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికలపై పార్టీ ఇంచార్జీలతో పాటు, పలువురు సీనియర్‌ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉపఎన్నికలు సందర్భంగా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ నిర్వహించిన సర్వేలో తెలంగాణ రాష్ట్ర సమితి.. కాంగ్రెస్ కన్నా చాలా ముందు వరుసలో ఉందని కేటీఆర్‌ అన్నారు.

50 శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌కే..
కనీసం 50 శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌కే వస్తాయని తమ అంతర్గత సర్వేలో తేలిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం సంతృప్తిగా ఉందని, రానున్న వారం రోజుల్లో మరింత ప్రణాళికాబద్ధంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో  కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు వలన టీఆర్‌ఎస్‌ ఓడిపోయిందని, ఈసారి కూడా అలాంటి కొన్ని వాహనాలకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని..  కారు గుర్తుని ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు డమ్మీ ఈవీఎంలను ఉపయోగించుకోవాలని కోరారు. టీఆర్ఎస్‌కు వివిధ సామాజిక వర్గాల నుంచి మద్దతు అద్భుతంగా వస్తుందన్నారు.

ఏం చెప్పాల్లో కాంగ్రెస్‌కు తెలియడం లేదు..
ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాలో కాంగ్రెస్‌కు తెలియడం లేదన్నారు. మరోవైపు ‘టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్‌ కి లాభం.. కారు గుర్తుకు ఓటేస్తే హుజూర్‌ నగర్ అభివృద్ధి బాట’ పడుతుందంటూ తాము చేస్తున్న ప్రచారానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిధులతో హుజూర్‌నగర్‌ను అభివృద్ధి చేస్తామంటూ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని, కానీ కేంద్ర, రాష్ట్రాల్లో ఎక్కడా కాంగ్రెస్ అధికారంలో లేదన్న విషయాన్ని ఆయన మర్చిపోయారని అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కి ఓటేస్తే హుజూర్‌నగర్‌ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.

ఈ ఉప ఎన్నికలతో బీజేపీ బలం ఎంతో తేలిపోతుందని, ఇన్నాళ్లుగా వారి మాటలు, వట్టి మూటలని తేలిపోతుందని కేటీఆర్ అన్నారు.  ఈ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ దక్కించుకుంటే అదే వారికి గొప్ప ఉపశమనం అన్నారు. తమకు ఎలాగూ ప్రజల్లో బలం లేదని తెలుసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసి పరోక్షంగా పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీల దొంగచాటు బంధాన్ని ప్రజల్లో ఎండగట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ ఇంచార్జీలకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement