సాక్షి, హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్‌లో రాజకీయం మరింత వేడెక్కింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డి గురువారం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఈ నెల 30న నామినేషన్ వేయనున్నారు.
ఈ నేపథ్యంలో 'హలో సర్పంచ్.. చలో హుజుర్‌నగర్' పేరుతో ప్రధాన పార్టీలకు రాష్ట్ర సర్పంచుల సంఘం ...ప్రధాన పార్టీలకు పోటీగా బరిలోకి దిగబోతోంది. హుజుర్ నగర్ స్థానం నుంచి తాము పోటీ చేయనున్నట్లు రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రకటించింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా... ఉప ఎన్నికల బరిలో మొత్తం 251మంది సర్పంచులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 17మంది పోటీ చేశారు. అందరికీ కలిపి 1,92,844 ఓట్లు పడ్డాయి. అయితే అన్ని పార్టీలో ఈ ఎన్నికల్లో బరిలోకి దిగి తమ సత్తా తేల్చుకునేందుకు సై అంటున్నా...ప్రధాన పార్టీల మధ్యనే గెలుపు ఓటములు ఉండనున్నాయి.
కాగా ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పెద్ద ఎత్తున పసుపు రైతులు ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర పెంపు కోసం నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి 236మంది రైతులు నామినేషన్లు వేశారు. కాగా ఇలా మూకుమ్మడిగా నామినేషన్లు వేయడంతో తెలంగాణలో ఇదే మొదటిసారి కాదు. 1996 ఎన్నికల్లో తమ ప్రాంతానికి సాగు, తాగు నీటిని కల్పించాలని జలసాధన సమితి నేతృత్వంలో నల్లగొండ పార్లమెంట్ స్థానానికి ఏకంగా 515 మంది నామినేషన్లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment