సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయ వర్గాలను ఆకర్షించిన హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితంపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఈనెల 21న ఎన్నిక జరగ్గా, గురువారం రానున్న ఫలితం ఎటువైపు మొగ్గు చూపుతుందన్న దానిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొనడంతో పందాలు మొదలయ్యాయి. ఎన్నిక జరగడానికి ఒకట్రెండు రోజుల ముందే ప్రారంభమైన ఈ బెట్టింగులు బుధవారం రాత్రికి తారస్థాయికి చేరాయి. రెండు రాష్ట్రాల్లోని బెట్టింగు రాయుళ్లు వేయి నుంచి లక్షల రూపాయల వరకు బెట్టింగులు కాస్తున్నారు. ఎగ్జిట్‌పోల్ ఫలితాలతో పాటు పోలింగ్ జరిగిన సరళి అధికార టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉండడంతో టీఆర్‌ఎస్ ఓడిపోతుందన్న పందాలపై భారీ ఆఫర్లు కూడా ఇస్తున్నారు.
సరిహద్దుల్లోనూ ఎక్కువే
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల గెలుపోటములపైనే ఎక్కువగా బెట్టింగులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోనూ, ఆ నియోజకవర్గానికి సరిహద్దుగా ఉన్న జిల్లాల్లోనూ బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. ఉమ్మడి నల్లగొండతోపాటు ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఈ ఫలితంపై పందాలు కాస్తున్నారు. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ హుజూర్‌నగర్ ఫలితంపై బెట్టింగులు జరుగుతున్నాయి. బుకీలు కూడా రంగ ప్రవేశం చేయడంతో గత రెండు రోజులుగా జోరందుకున్న ఈ పందాల్లో స్థానిక బెట్టింగ్ రాయుళ్లు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
గెలుపే కాదు...మెజార్టీలపై కూడా
ఈ ఉపఎన్నికలో ఏ పార్టీ గెలుస్తుందనే దానితోపాటు ఆయా పార్టీలకు వచ్చే మెజార్టీల మీద కూడా బెట్టింగులు నడుస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌కు ఎంత మెజార్టీ వస్తుందనే దానిపై పందాలు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ గెలుస్తుందని 100 రూపాయలు బెట్టింగ్ చేస్తే 75 రూపాయలే ఇస్తామని, టీఆర్‌ఎస్‌కు 10వేల మెజార్టీ వస్తుందంటే రూపాయికి రూపాయిన్నర, 20వేల మెజార్టీ వస్తుందని పందెం కాస్తే రూపాయికి రెండు రూపాయలు ఇస్తామనే స్థాయిలో బుకీలు, స్థానిక బెట్టింగ్ రాయుళ్లు ఆఫర్లు ఇస్తున్నారు. అయితే, ఇలాంటి బెట్టింగ్‌లలో పాల్గొనడం చట్టవిరుద్ధమని, ఇలాంటి వాటికి ప్రజలు దూరంగా ఉండాలని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment