సూర్యాపేటలో ఆ సెంటిమెంట్‌! బీఆర్‌ఎస్‌కు హ్యాట్రిక్‌ సాధ్యమేనా? | Nalgonda: Who Will Next Incumbent in Suryapet Constituency | Sakshi
Sakshi News home page

సూర్యాపేటలో ఆ సెంటిమెంట్‌! బీఆర్‌ఎస్‌కు హ్యాట్రిక్‌ సాధ్యమేనా?

Published Sat, Aug 19 2023 3:18 PM | Last Updated on Tue, Aug 29 2023 11:04 AM

Nalgonda: Who Will Next Incumbent in Suryapet Constituency - Sakshi

ఈ నియోజకవర్గం 1962లో ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు మొత్తం 13 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరుగగా ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ. నాలుగుసార్లు టీడీపీ, చెరో రెండు సార్లు సీపీఐఎం, బీఆర్ఎస్ పార్టీలు విజయం సాధించాయి. తొలిసారి జరిగిన ఎన్నికల్లో సీపీఐఎం అభ్యర్థి ఉప్పల మల్సూర్ ఎన్నికయ్యారు. 2004 వరకు ఎస్సీ రిజర్వుడుగా ఉన్న సూర్యాపేట 2009లో జనరల్‌గా మారింది. 2009లో రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించగా ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి విజయం సాధిస్తూ వస్తున్నారు. 

నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు :

ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ నేత కూడా మూడోసారి విజయం సాధించిన దాఖలాలు లేవు. 1962, 67లో ఉప్పల మల్సూర్ రెండు సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత ఆకారపు సుదర్శన్ కూడా రెండు సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం ఉన్న జగదీష్ రెడ్డి కూడా 2018 గెలుపుతో రెండోసారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి గత చరిత్రను ఆయన తిరగరాసి మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యే అవుతారా లేక గతమే రిపీట్ అవుతుందా అనేది ఆసక్తిని కలిగిస్తోంది. 

ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : 

ఇక్కడ ప్రధానంగా అభివృద్ధే ఎన్నికలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. సూర్యాపేట నియోజకవర్గం తెలంగాణ ఏర్పడిన తర్వాత మెడికల్ కాలేజ్ ఏర్పాటు, జిల్లాకు నూతన కలెక్టరేట్, రోడ్ల విస్తరణ పనులు, సమీకృత మార్కెట్ నిర్మాణంతో పాటు సద్దల చెరువును ట్యాంక్ బండ్‌గా మార్చడంతో ప్రజలను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అయితే కొన్ని మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం సరిగా లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు కొందరు కింది స్థాయి బీఆర్ఎస్ నేతల తీరు కూడా రాజకీయంగా ఆ పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. మూసీ కాలువల ఆధునికీకరణ చేయాల్సి ఉంది. దీనికి తోడు సద్దల చెరువు పొంగితే దిగువన ఉన్న కాలనీ వాసులు ముంపుకు గురవుతున్నారు. ఈ సమస్యకు శాశ్యత పరిష్కారం చూపించాల్సి ఉంది. ఉండ్రుగొండను పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. 

రాజకీయ పార్టీల వారీగా ప్రధాన పార్టీల టికెట్ల ఆశిస్తున్నవారు :

ఇక నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోరు ఉండనుంది. బీఆర్ఎస్ నుంచి తెలంగాణ కేబినేట్‌లో మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఆయనకు పోటీగా బీఆర్ఎస్‌ నుంచి మరో నేత కనిపించడం లేదు. అయితే కొందరు నేతల్లో మాత్రం అంతర్గతంగా అసంతృప్తిని వెలుబుచ్చుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉంటారు అని చెప్పుకునే ఓ నేత మంత్రికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైరి పార్టీకి చెందిన కీలక నేతతో సమావేశం అయ్యారని తెలుస్తోంది.

కాంగ్రెస్ విషయానికి వస్తే ఇక్కడ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, రేవంత్ అనుచరుడిగా ఉన్న పటేల్ రమేష్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి టికెట్ రాకున్నా ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నారు. బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ బూరా నర్సయ్య, వెంకటేశ్వరరావు కుమారుడు వరుణ్ పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. 

కులాల పరంగా ఓటర్లు:

 నియోవజకవర్గంలో బీసీలు, ఎస్సీలు, రెడ్డి, వైశ్య సామాజిక వర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉంటారు.

 సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైశ్యతో పాటు రెడ్డి సామాజికవర్గపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

 ఆత్మకూరు ఎస్ మండలంలో రెడ్డి, బీసీ, ఎస్టీ సామాజిక వర్గపు ఓటర్లు నిర్ణాయాత్మక శక్తిగా ఉంటారు. 

నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు 

నదులు : ఇక్కడ ప్రధాన నది మూసీ. సూర్యాపేట, పెన్‌పహాడ్ మండలాల గుండా మూసీ నది ప్రవహిస్తోంది. ఇక ఎస్సారెస్పీ కాలువ ద్వారా నియోజకవర్గానికి సాగు నీరు అందుతుంది.

పర్యాటకం : చివ్వెంల మండలం దురాజ్ పల్లిలో జరిగే లింగమంతుల జాతర తెలంగాణలోనే రెండో అతిపెద్దది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అన్ని వర్గాల ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి గుట్టపై నెలకొని ఉన్న లింగమంతుల స్వామిని దర్శించుకుని వెళ్తారు. ఈ జాతర మూడు రోజల పాటు సాగుతుంది. ఇక ఆరువేల ఏళ్ల చరిత్ర ఉన్న ఉండ్రుగొండ గుట్టలు కూడా సూర్యాపేటకు పదికిలోమీటర్ల దూరంలో ఉంటాయి.

ఆలయాలు : ఇక్కడ స్వయంభూ లక్ష్మీనారసింహస్వామి కొలువై ఉన్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఇక్కడకు భారీ ఎత్తున భక్తులు వస్తారు. ఇక వందల ఏళ్ల చరిత్ర ఉన్న పిల్లలమర్రి దేవాలయంతో పాటు అంతే ప్రాచుర్యం పొందిన శివాలయాలు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement