తుంగతుర్తి నియోజవర్గం 1957లో ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి సాయుధ పోరాటం చేసి చరిత్రలో నిలిచిన మల్లు స్వరాజ్యం రెండు సార్లు విజయం సాధించారు. ఇక మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నాలుగుసార్లు విజయం సాధించారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న మల్లు స్వరాజ్యం నియోజకవర్గంపై తన మార్కు చూపించారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వస్థలం కూడా తిరుమలగిరి మండలమే. మరోవైపు మంత్రి జగదీష్ రెడ్డి స్వస్థలం కూడా నాగారమే. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి అత్యధికంగా నాలుగు సార్లు విజయం సాధించారు. 1985, 1989, 1994లో దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. అయితే 1999లో మాత్రం సంకినేని వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఆతర్వాత మరోసారి 2004లో గెలిచారు. 2009లో ఇది ఎస్సీ రిజర్వుడు అయింది. రిజర్వుడుగా మారిన తర్వాత తొలి ఎన్నికల్లో 2009 మోత్కుపల్లి నర్సింహులు గెలిచారు. 2014, 18లో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ఈసారి కూడా బీఆర్‌ఎస్ తరపున ఆయనకే టికెట్ దక్కింది.
అభివృద్ది చేసినా.. ప్రతిపక్షాలకు చిక్కేలా బీఆర్‌ఎస్?
తెలంగాణ ఏర్పడిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి పథాన నడిచిందనే వాదన ఉంది. అయితే ఇక్కడ నుంచి వెళ్లే మూసీ, బిక్కేరు వాగు నుంచి నిత్యం వందలాది లారీల ఇసుక తరలివెళ్తోంది. ఇసుక కూడా ఎన్నికల ప్రధాన విమర్శనాస్త్రంగా ప్రతిపక్షాలకు మారే అవకాశం ఉంది. దీనికి తోడు ఇసుక లారీల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉందని ప్రజలు అంటున్నారు.
ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు :
ఇక్కడ ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. గత రెండు ఎన్నికల్లో గెలిచిన కిషోర్ ఆధిక్యం మూడు వేలు దాటలేదు అంటేనే పోటీ ఎంత రసవత్తరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ నుంచి కిషోరే మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై నేతలతో పాటు ఆ పార్టీ అధిష్టానానికి కూడా క్లారిటీ లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యంత పటిష్టంగా ఉంది. ఆ పార్టీ నుంచి వడ్డేపల్లి రవితో పాటు గతంలో పోటీ చేసి ఓడిన అద్దంకి దయాకర్ కూడా మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి కడియం రామచంద్రయ్య మరోసారి పోటీ చేయనున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పాల్వాయి రజిని కూడా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
వృత్తిపరంగా ఓటర్లు :
నియోజకవర్గంలో ఒకప్పుడు సాగునీటి కొరత ఉండేది. కానీ వైఎస్సార్ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీటి కొరత తీరడంతో పాటు ప్రస్తుతం కాళేశ్వరం జలాలు కూడా వస్తుండటంతో రెండు పంటలు పండుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా రైతులతో పాటు వ్యవసాయ కూలీలు కూడా అధికంగా ఉంటారు. మరోవైపు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్తుంటారు. ఇక తిరుమలగిరి వ్యాపార కేంద్రంగా ఉంది.
మతం/కులాల వారిగా ఓటర్లు :
ఇక్కడ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లే అధికంగా ఉంటారు. దాదాపు 45 నుంచి 50 వేల వరకు వారే ఉంటారని లెక్కలు చెప్తున్నాయి. ఈ తర్వాత యాదవ, గౌడ, ముప్పై వేల చొప్పున ఎస్టీ లంబాడకు 18 వేలు ఓటర్లు ఉంటారు. రెడ్డి సామాజిక వర్గానికి ఇక్కడ 18 నుంచి 20 వేల వరకు ఓట్లు ఉంటాయి.
నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు..
నల్లగొండ ఉమ్మడి జిల్లాలో విశాలమైన రహదారులు ఉన్న నియోజకవర్గం ఇదే. ఇక్కడి నుంచి పలు జాతీయ రహదారులు వెళ్తుంటాయి. మూసీ, బిక్కేరు వాగులు ప్రవహిస్తుంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బౌద్ధ క్షేత్రం పణిగిరి ఈ నియోజకవర్గంలోనే ఉంటుంది. సూర్యదేవాలయంతో పాటు ప్రసిద్ధి గాంచిన రామ, శివాలయాలకు పెట్టిన పేరు. పణిగిరి క్షేత్రానికి ప్రపంచ నలుమూలల నుంచి బౌద్దులు వస్తుంటారు. కానీ దాన్ని మరింత కాపాడాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment