tungaturthi
-
హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అద్దంకి దయాకర్ రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోవైపు.. పార్టీలు కొన్ని స్థానాల్లో అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ అద్ధంకి దయాకర్‌కు హ్యాండిచ్చింది. మరోవైపు, తనకు సీటు ఇవ్వకపోవడంపై దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం గౌరవిస్తాను. మందుల శామ్యూల్ గెలుపు కోసం పనిచేస్తాను. ప్రతీ నిర్ణయం వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. నా మద్దతుదారులు, కార్యకర్తలు అధైర్యపడవద్దు.. ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడవద్దు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇక, తుంగతుర్తి నుంచి మందుల శామ్యూల్‌కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో, ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. ఇదిలా ఉండగా.. పటాన్చెరు నియోజకవర్గంలో చివరి నిమిషంలో అభ్యర్థి మార్పు జరిగింది. దామోదర రాజనర్సింహ పంతం నెగ్గించుకున్నారు. తన అనుచరుడు కాటా శ్రీనివాస్ గౌడ్‌కు అధిష్టానం టికెట్ ఇచ్చింది. దీంతో, రాజనర్సింహ శాంతించారు. మరోవైపు.. ఎన్నికల్లో పొత్తుల అంశంలో కాంగ్రెస్-సీపీఎం మధ్య చర్చలు విఫలమయ్యాయి. చివరి రోజు వరకు మిర్యాలగూడ టికెట్‌ను సీపీఎం కోసం కాంగ్రెస్ పార్టీ ఆపింది. చర్చలు ఫలించకపోవడంతో అభ్యర్థిని ప్రకటించింది. కాగా, సీపీఎం పొత్తు లేకపోవడంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్థానాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. "పార్టీ నిర్ణయమే ప్రధానం మరియు నేను దానిని అంగీకరిస్తున్నాను. రేపు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కు నేను హాజరవుతాను & పార్టీని గెలిపించడానికి కృషి చేస్తా." : అద్దంకి దయాకర్ గారు. pic.twitter.com/unPMA83qHt — Telangana Congress (@INCTelangana) November 9, 2023 -
తుంగతుర్తి: పటిష్టంగా కాంగ్రెస్.. బీఆర్ఎస్కు గట్టి పోటీ తప్పదా?
తుంగతుర్తి నియోజవర్గం 1957లో ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి సాయుధ పోరాటం చేసి చరిత్రలో నిలిచిన మల్లు స్వరాజ్యం రెండు సార్లు విజయం సాధించారు. ఇక మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నాలుగుసార్లు విజయం సాధించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న మల్లు స్వరాజ్యం నియోజకవర్గంపై తన మార్కు చూపించారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వస్థలం కూడా తిరుమలగిరి మండలమే. మరోవైపు మంత్రి జగదీష్ రెడ్డి స్వస్థలం కూడా నాగారమే. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి అత్యధికంగా నాలుగు సార్లు విజయం సాధించారు. 1985, 1989, 1994లో దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. అయితే 1999లో మాత్రం సంకినేని వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఆతర్వాత మరోసారి 2004లో గెలిచారు. 2009లో ఇది ఎస్సీ రిజర్వుడు అయింది. రిజర్వుడుగా మారిన తర్వాత తొలి ఎన్నికల్లో 2009 మోత్కుపల్లి నర్సింహులు గెలిచారు. 2014, 18లో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ఈసారి కూడా బీఆర్ఎస్ తరపున ఆయనకే టికెట్ దక్కింది. అభివృద్ది చేసినా.. ప్రతిపక్షాలకు చిక్కేలా బీఆర్ఎస్? తెలంగాణ ఏర్పడిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి పథాన నడిచిందనే వాదన ఉంది. అయితే ఇక్కడ నుంచి వెళ్లే మూసీ, బిక్కేరు వాగు నుంచి నిత్యం వందలాది లారీల ఇసుక తరలివెళ్తోంది. ఇసుక కూడా ఎన్నికల ప్రధాన విమర్శనాస్త్రంగా ప్రతిపక్షాలకు మారే అవకాశం ఉంది. దీనికి తోడు ఇసుక లారీల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉందని ప్రజలు అంటున్నారు. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు : ఇక్కడ ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. గత రెండు ఎన్నికల్లో గెలిచిన కిషోర్ ఆధిక్యం మూడు వేలు దాటలేదు అంటేనే పోటీ ఎంత రసవత్తరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ నుంచి కిషోరే మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై నేతలతో పాటు ఆ పార్టీ అధిష్టానానికి కూడా క్లారిటీ లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యంత పటిష్టంగా ఉంది. ఆ పార్టీ నుంచి వడ్డేపల్లి రవితో పాటు గతంలో పోటీ చేసి ఓడిన అద్దంకి దయాకర్ కూడా మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి కడియం రామచంద్రయ్య మరోసారి పోటీ చేయనున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పాల్వాయి రజిని కూడా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వృత్తిపరంగా ఓటర్లు : నియోజకవర్గంలో ఒకప్పుడు సాగునీటి కొరత ఉండేది. కానీ వైఎస్సార్ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీటి కొరత తీరడంతో పాటు ప్రస్తుతం కాళేశ్వరం జలాలు కూడా వస్తుండటంతో రెండు పంటలు పండుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా రైతులతో పాటు వ్యవసాయ కూలీలు కూడా అధికంగా ఉంటారు. మరోవైపు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్తుంటారు. ఇక తిరుమలగిరి వ్యాపార కేంద్రంగా ఉంది. మతం/కులాల వారిగా ఓటర్లు : ఇక్కడ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లే అధికంగా ఉంటారు. దాదాపు 45 నుంచి 50 వేల వరకు వారే ఉంటారని లెక్కలు చెప్తున్నాయి. ఈ తర్వాత యాదవ, గౌడ, ముప్పై వేల చొప్పున ఎస్టీ లంబాడకు 18 వేలు ఓటర్లు ఉంటారు. రెడ్డి సామాజిక వర్గానికి ఇక్కడ 18 నుంచి 20 వేల వరకు ఓట్లు ఉంటాయి. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు.. నల్లగొండ ఉమ్మడి జిల్లాలో విశాలమైన రహదారులు ఉన్న నియోజకవర్గం ఇదే. ఇక్కడి నుంచి పలు జాతీయ రహదారులు వెళ్తుంటాయి. మూసీ, బిక్కేరు వాగులు ప్రవహిస్తుంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బౌద్ధ క్షేత్రం పణిగిరి ఈ నియోజకవర్గంలోనే ఉంటుంది. సూర్యదేవాలయంతో పాటు ప్రసిద్ధి గాంచిన రామ, శివాలయాలకు పెట్టిన పేరు. పణిగిరి క్షేత్రానికి ప్రపంచ నలుమూలల నుంచి బౌద్దులు వస్తుంటారు. కానీ దాన్ని మరింత కాపాడాల్సిన అవసరం ఉంది. -
దయాకర్‌కు నోటీసులు.. మదన్మోహన్కు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన అద్దంకి దయాకర్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇటీవల ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టి పార్టీ నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం క్రమశిక్షణ ఉల్లంఘనగా భావించి ఈ నోటీసుల్విలని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం నిర్ణయించింది. ఆదివారం గాంధీభవన్‌లో సంఘం చైర్మన్ జి.చిన్నారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశం లో సంఘం సభ్యులు కమలాకర్‌రావు, మాజీ మంత్రి వినోద్, గంగారాంలు పాల్గొన్నారు. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీచేసిన కె.మదన్మోహన్రావును పార్టీ లైన్ దాట వద్దని క్రమశిక్షణ సంఘం హెచ్చరించింది. ఆయన పార్టీ పేరుతో కాకుండా మదన్ యూత్ ఫోర్స్ పేరుతో కార్యక్రమాలు చేయడం, పార్టీ నాయకత్వానికి సమాచారం లేకుండానే ఎల్లారెడ్డిలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం వంటివి ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలంటూ క్రమశిక్షణ సంఘం ఆయనకు లేఖ పంపనుంది. కాగా, మదన్మోహన్ను సస్పెండ్ చేసిన కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్‌కు ఆ అధికారం లేదని అభిప్రాయపడ్డ కమిటీ, డీసీసీ అధ్యక్షులకు వచ్చే ఫిర్యాదులను రాష్ట్ర కమిటీకి తెలియ జేయాలని, అలా నేరుగా సస్పెండ్ చేయవద్దంటూ ఆయనకు కూడా లేఖ రాయాలని నిర్ణయించింది. (చదవండి: బీజేపీకి తీన్మార్ మల్లన్న గుడ్‌బై?) ఇక, దుబ్బాక నియో జకవర్గానికి చెందిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పార్టీకి సంబంధించిన వారిపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తున్నారన్న అంశంపై సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కమిటీ సూచించింది. జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి తన పరిధి దాటి వరంగల్‌లో రాజకీయం చేస్తున్నారని.. వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన క్రమశిక్షణ సంఘం, రాఘవరెడ్డి పాలకుర్తికే పరిమితం కావాలని సూచిస్తూ ఆయనకు లేఖ రాయాలని నిర్ణయించింది. (చదవండి: అన్నీ కొరతలే.. అద్భుతం: కేటీఆర్ ట్వీట్) -
అత్యాచారం చేసి.. ఆపై పెట్రోల్ పోసి!
సాక్షి, తిరుమలగిరి (తుంగతుర్తి): ప్రేమ పేరుతో ఓ యువతిని వేధించి, అత్యాచారం చేసి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడో ప్రేమోన్మాది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం రాఘవాపురంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. తిరుమలగిరి ఎస్సై డానియెల్ తెలిపిన వివరాల ప్రకారం.. రాఘవాపురం గ్రామానికి చెందిన భూక్య వెంకన్నకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మొదటి కూతురి వివాహం కాగా, రెండో కూతురు (17) మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని మమత పారా మెడికల్ కాలేజీలో చదువుకుంటోంది. భూక్య వెంకన్న తన భార్యతో కలసి హైదరాబాద్‌లోని బోడుప్పల్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన గుగులోతు వెంకటేశ్ ఇంటర్ పూర్తిచేసి ట్రాక్టర్ నడుపుకుంటున్నాడు. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని రెండేళ్లుగా యువతిని వేధిస్తున్నాడు. యువతి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో గ్రామపెద్దలు పంచాయితీ పెట్టారు. అమ్మాయి జోలికి వెళ్లొద్దని హెచ్చరించి వదిలేశారు. ఈ విషయంలో కక్ష కట్టిన వెంకటేశ్ శుక్రవారం రాత్రి అమ్మాయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు యువతిని వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎమ్మెల్యే అదిరే స్టెప్పులు.. వైరల్ వీడియో
సాక్షి, సూర్యాపేట : తెలంగాణ ప్రజల సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ సంబరాల్లో సామాన్యులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అనే భేదాలు లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ నేను సైతం అంటూ స్టెప్పులేసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న వారిలో ఉత్సాహాన్ని రెట్టింపుచేశారు. శాలిగౌరారంలో జరిగిన మహా బతుకమ్మ వేడుకల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటలు ప్లే అవుతుండగా ఆయన రెట్టించిన ఉత్సాహంతో కాలు కదిపారు. ఎమ్మెల్యే ఉత్సాహంగా స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజాప్రతినిధులు.. పండుగలు, సంస్కృతికి ఎప్పుడూ సామాన్యులే అన్న తరహాలో బతుకమ్మ వేడుకల్లో పాటలకు డ్యాన్స్ చేస్తూ అందర్నీ గాదరి కిషోర్ అలరించారు. ఎమ్మెల్యే డ్యాన్స్ చేస్తున్నంతసేపు అక్కడున్నవారు ఈలలువేస్తూ ఆయనకు మద్ధతు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలు.. సామాన్యులు, సెలబ్రిటీలు అందర్నీ ఏకం చేస్తాయంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. -
జగ్జీవన్ ఆశయసాధనకు కృషిచేయాలి
► ఎమ్మెల్యే గాదరి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సామేలు ► తుంగుతుర్తిలో జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ తుంగతుర్తి: బాబు జగ్జీవన్‌రామ్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జగ్జీవన్‌రామ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దళితుల సంక్షేమం కోసం బాబు జగ్జీవన్‌రామ్ ఎనలేని కృషి చేశారని అన్నారు. దేశంలో మొదటి ఉపప్రధానిగా దళితుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టా రని పేర్కొన్నారు. ఐక్యంగా ఉండి మన హక్కుల సాధన కోసం కృషి చేయాలన్నారు. ఎవరు ఏపార్టీలో ఉన్నా అందరూ కలిసి ఉండాలని అన్నారు. దళితులకు రాజ్యాధికారం రావడం కోసం ఐక్యపోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుగులోతు స్వాతి తేజానాయక్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుడిపాటి సైదులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గుడిపాటి సైదులు, ఎర్ర యాదగిరి, మిట్టగడ్పుల పురుషోత్తమ్, బొంకూరి భిక్షం, దాసరి శ్రీను, బొజ్జ యాదగిరి, ఇరుగు సురేష్, భాస్కర్, శ్యాంసుందర్, నగేష్, శ్రీను, వెంకన్న, బొంకూరి నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
తుంగతుర్తి అభివృద్ధికి కృషి
తుంగతుర్తి తుంగతుర్తి పేరుకే నియోజకవర్గం కాని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తుంగతుర్తిలో శుక్రవారం నిర్వహించిన మాదిగ చైతన్య మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తుంగతుర్తి నేషనల్ హైవేకి, వరంగల్ మహా పట్టణాలకు దగ్గర ఉన్నప్పటికి అభివృద్ది చెందకపోవడం విచారకరమన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో తుంగతుర్తిలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తుంగతుర్తిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వారికి సంఘీబావం మూడు రోజులుగా పసునూర్ మాజీ ఎంపీటీసీ తొడ్సు లింగయ్య, ఎమ్మార్పీఎస్ నాయకుడు నరాల వీరయ్యలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయాన్ని ప్రొఫెసర్ కోదండరాం పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసునూర్ గ్రామాన్ని తుంగతుర్తిలో ఉంచే విధంగా సీసీఎల్ఏకు ఫిర్యాదు చేస్తానని హామీ ఇచ్చారు. పాలన సౌలభ్యం కోసం మండలాలను ఏర్పాటు చేయడం మంచిదే కాని ప్రజల అభీష్టం మేరకే చేయాలన్నారు. మాదిగ చైతన్య మహోత్సవ కార్యక్రమానికి మాదిగలు పెద్ద ఎత్తున బతుకమ్మలను తయారు చేసుకొని భారీ ర్యాలీగా వీధుల గుండా ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా వద్దకు వచ్చి ఆటపాటలతో అందరిని ఆనందపరిచారు. ఈ కార్యక్రమంలో నిజాం కళాశాల ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, ప్రభాకర్ రెడ్డి, ఏపూరి సోమన్న, ఎంపీడీఓ వెంకటాచారి, సాయిబాబా, పాల్వాయి నగేష్, హరిక్రిష్ణ, లక్ష్మణ్, యాదగిరి, శ్యాంసుందర్, సుందర్ రావు, పురుషోత్తం, మల్లెపాక సుధాకర్, అంజయ్య, నాగయ్య, ఎడవెళ్లి ఈశ్వర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయం చేయాలని వివాహిత ఆందోళన
తుంగతుర్తి: తన భర్తను దాచిపెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్న అత్తమామ, ఆడపడుచుపై చర్య తీసుకొని న్యాయం చేయాలని కోరుతూ ఓ వివాహిత అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన గుండగాని వెంకన్న, పద్మ దంపతుల కుమార్తె విజయ, అదే గ్రామానికి చెందిన దుబ్బాక సోమిరెడ్డి విజయలక్ష్మిల కుమారుడైన దుబ్బాక సాయి కిరణ్‌రెడ్డి రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను కిరణ్‌రెడ్డి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. మూడు మాసాల క్రితమే ఆలయంలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి కిరణ్‌రెడ్డి విజయ ఇంట్లోనే ఉంటున్నాడు. కాగా, గత 15 రోజుల క్రితం కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసి వస్తానని ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ నెల 1వ తేదీన విజయ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్తను అత్తింటి వారే దాచి పెట్టారని ఆరోపిస్తూ విజయ మంగళవారం ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకుని ట్రైనీ ఎస్ఐ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ నెల 11వ తేదీలోపు కిరణ్‌రెడ్డిని అప్పగిస్తామని వారి తల్లిదండ్రి తెలిపారని వివరించారు. బాధితురాలికి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించింది. విజయకు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. -
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
తుంగతుర్తి : ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని వీఎన్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే సర్వే చేయించి పంటలు నష్టపోయిన, ఇళ్లు కూలిన బాధితులకు నష్టపరిహారం అందించాలని కోరారు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా చెరువులను, కుంటలను నింపాలన్నారు. వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సూర్యాపేటలో ఈ నెల 5, 6 తేదీల్లో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో తిరుందాసు గోపి, ముల్కలపల్లి రాములు, బుర్ర శ్రీనివాస్, బొల్లు యాదగిరి, మూరగుండ్ల లక్ష్మయ్య, పలా సుదర్శన్, చంద్రమౌళి, విజయమ్మ, ఎస్.రాములు, లింగయ్య, కుమార్, వెంకటనర్సు, నర్సయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలి
తుంగతుర్తి ప్రతి నీటిబొట్టును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని కొత్తగూడెం, వెంపటి, రావులపల్లిలో ఎస్సారెస్పీ కాల్వలకు విడుదలయిన బయ్యన్న వాగు రిజర్వాయర్ జలాలను పరిశీలించి మాట్లాడారు. 2017 జూన్ వరకు అస్తవ్యస్తంగా ఉన్న ఎస్సారెస్పీ కాల్వలను పూర్తి చేసి అన్ని గ్రామాల్లోని చెరువులకు నీటిని సరఫరా చేసే విధంగా కృషి చేస్తామన్నారు. రావులపల్లి చెరువులోకి వెళ్లే కాల్వ కోసం భూమి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ రంగానికి నీటిని అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండాయని, దీంతో రైతాంగం సంతోషంగా ఉన్నారని అన్నారు. కాని జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి, నూతనకల్ మండలాలు, సూర్యాపేట నియోజకవర్గంలోని పెన్‌పహాడ్, మోతె, చివ్వెంల, కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం మండలాల్లో వర్షాలు పూర్తి స్థాయిలో కురవక చెరువులు, కుంటలు నిండలేదని అన్నారు. ఎస్సారెస్పీ రెండవ దశ కాలువల ద్వారా 69,70,71 డీబీఎమ్ల ద్వారా నీటిని సరఫరా చేసి ఆయా మండలాల్లోని చెరువులు, కుంటలు నింపడానికి వరంగల్ జిల్లా బయ్యన్న వాగు నుంచి వృథాగా పోతున్న నీటిని ఎస్సారెస్పీ కాలువలకు సరిపడా నీటిని విడుదల చేయాలని అధికారులను కోరారు. సుమారు 1500 క్యూసెక్కులు విడుదల చేయాలని కోరితే అధికారులు 600 క్యూసెక్కుల మేరకు నీటిని విడుదల చేయడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వృ«థాగా పోయే నీటిని చెరువులు నింపడానికి వదిలివేయమంటే ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి నీటి విడుదలకు వాగు వద్ద గేట్లను పైకిఎత్తించారు. వాగు నుంచి అలుగు బంద్ అయ్యేంతవరకు గేట్లను దించవద్దని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, తహసీల్దార్లు జగన్నాథరావు, పులి సైదులు, ఎంపీడీఓ వెంకటాచారి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పాశం విజయ యాదవరెడ్డి, వైస్ చైర్మన్ గుజ్జ యుగేంధర్ రావు, టీఆర్ఎస్వీ జిల్లా అద్యక్షులు కే.శోభన్‌బాబు, జెడ్పీటీసీలు వరలక్ష్మి, నర్సింగ్ నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుడిపాటి సైదులు, రజాక్, దుగ్యాల రవీందర్ రావు, దాయం విక్రంరెడ్డి, కోడి శ్రీను, గుండగాని రాములు గౌడ్, వెంకటనారాయణ గౌడ్, తాటికొండ సీతయ్య, నల్లు రాంచంద్రారెడ్డి, బబ్బిసింగ్, గోపాల్ రెడ్డి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
‘మహా ఒప్పందం’తో తెలంగాణకు అన్యాయం
తుంగతుర్తి : మహారాష్ట్ర ఒప్పందంతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని టీపీసీసీ అధికార ప్రతినిది అద్దంకి దయాకర్ అన్నారు. మండల కేంద్రంలో వర్షాభావ పరిస్థితితులతో ఎండిపోయిన వరి పొలాలను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందన్నారు. నాడు వైఎస్సార్ పాలనలో 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు కట్టడానికి అనాటి మహా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారని.. ఆయన అకాల మరణంతో పాటు తెలంగాణ ఉద్యమం కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం మరుగున పడిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడతామని బెదిరించడం ఎంత వరకు సమంజసమన్నారు. కాంతనపల్లి ప్రాజెక్టులను రద్దు చేసి తుంగతుర్తి నియోజకవర్గ రైతులకు ఈ ప్రాంత మంత్రి జగదీశ్‌రెడ్డి తీరని అన్యాయం చేశారన్నారు. ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుగులోతు టీక్యానాయక్, ఏశమల్ల సృజన్, కలకొట్ల మల్లేష్, మంగళపల్లి నాగరాజు, కాసర్ల ఉప్పలయ్య, మల్లెపాక కర్ణాకర్ ఉన్నారు. -
ఆటోబోల్తా మహిళ మృతి
రెడ్డిగూడెం (తుంగతుర్తి) : ఆటోబోల్తా పడి మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి రెడ్డిగూడెం గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు, మృతిరాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన అంగన్వాడీ ఆయా కొలిపాక దేవకమ్మ (60) ఉయ్యాల రజిత, ఉయ్యాల పవన్, సూర్యాపేట ఆసుపత్రికి వెళ్లి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో మద్దిరాల ఎక్స్‌రోడ్డు వద్ద బస్సు దిగి తన స్వగ్రామం రెడ్డిగూడానికి తునికి కుమార స్వామి ఆటోలో వస్తున్నారు. రెడ్డిగూడెం శివారులో స»Œ స్టేషన్ వద్దకు రాగానే ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న దేవకమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఉయ్యాల రజిత, పవన్, గుర్రాల ప్రవీణ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. వీరిలో రజిత పరిస్థితి విషమంగా ఉంది. మృతురాలి కుమారుడు కొలిపాక వెంకన్న ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ రాంకోటి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఆసుపత్రికి తరలించారు. -
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
నూతనకల్ తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడమే తన ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని మద్దిరాల, వెంకెపల్లి గ్రామాల్లో సీసీరోడ్లు, మినరల్ వాటర్‌ట్యాంకు, బోరు, మోటార్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యలు ఉన్న గ్రామాలను గుర్తించి, వాటిని పరిష్కరించడం కోసం త్వరలోనే పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. తన దత్తత గ్రామమైన మద్దిరాలలో వీధిలైట్లు, సీసీ రోడ్లు, మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.58కోట్లు, రోడ్డు భవనాల శాఖ నుంచి రూ.140వేల కోట్లతో రహదారులు అభివృద్ధి పర్చామని తెలియజేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని చెరువులను, కుంటలను నింపడం కోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశానని వారం పది రోజుల్లో నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపుతామని రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం ముకుందాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ నర్సింగ్ కొమరయ్య ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుగులోతు నర్సింగ్‌నాయక్, పీఏసీఎస్ చైర్మన్ ఎస్ఏ. రజాక్, సర్పంచ్ రాంపాక మంజులసైదులు, ఎంపీటీసీ గూడ అన్నమ్మశివలింగారెడ్డి, బెజ్జంకి శ్రీరాంరెడ్డి, తొనుకునూరి అశోక్‌గౌడ్, కందాల దామోదర్‌రెడ్డి, తుంగతుర్తి విద్యాసాగర్‌రావు, భూరెడ్డి సంజీవరెడ్డి, నలమాస రాములు, ఆకుల ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. -
గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
తుంగతుర్తి విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిత్ర సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు కె.వేణు కోరారు. మంగళవారం మండలంలోని పసునూర్ జెడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాలల్లోని గ్రంథాలయాలకు పుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి తన జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం పుస్తకాలు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. ఉన్నత పాఠశాలలో రూ.10వేలు విలువ చేసే పుస్తకాలు, ప్రా«థమిక పాఠశాలలో రూ.5వేల విలువ చేసే పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తొడుసు లింగయ్య, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మురళి, వెంకటమల్లు, మిత్ర సేవా ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ ఏ.రఘు, కోశాదికారి విజయ్‌కుమార్, సభ్యులు సంపత్, కిరణ్, ప్రవీణ్, ఉపేందర్ తదితరులు ఉన్నారు. -
హరితహారాన్ని అంతా మెచ్చుకుంటున్నారు..
అర్వపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విదేశీయులు కూడా ప్రశంసిస్తున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. గురువారం అర్వపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో అమెరికా దేశస్తులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 5 కోట్ల మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. అమెరికాలోని ఎల్డీఎస్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డార్లా న్యూటన్, లారెన్స్ న్యూటన్ మనోహర్ బేకరా, ట్రస్ట్ కోర్డినేటర్ శేఖర్ అలమూరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమం ఎంతో బాగుందని కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాశం విజయయాదవరెడ్డి, ఎంపీపీ దావుల మనీషావీరప్రసాద్, వైస్ చైర్మన్ గుజ్జ యుగేందర్‌రావు, జడ్పీటీసీ సంద అమల, వైస్ ఎంపీపీ బొడ్డు వెంకన్న, గుండగాని అంబయ్య, తహసీల్దార్ పులి సైదులు, ఎంపీడీఓ శిరీష తదితరులు పాల్గొన్నారు.