న్యాయం చేయాలని వివాహిత ఆందోళన
న్యాయం చేయాలని వివాహిత ఆందోళన
Published Tue, Oct 4 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
తుంగతుర్తి:
తన భర్తను దాచిపెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్న అత్తమామ, ఆడపడుచుపై చర్య తీసుకొని న్యాయం చేయాలని కోరుతూ ఓ వివాహిత అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన గుండగాని వెంకన్న, పద్మ దంపతుల కుమార్తె విజయ, అదే గ్రామానికి చెందిన దుబ్బాక సోమిరెడ్డి విజయలక్ష్మిల కుమారుడైన దుబ్బాక సాయి కిరణ్‌రెడ్డి రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను కిరణ్‌రెడ్డి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. మూడు మాసాల క్రితమే ఆలయంలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి కిరణ్‌రెడ్డి విజయ ఇంట్లోనే ఉంటున్నాడు. కాగా, గత 15 రోజుల క్రితం కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసి వస్తానని ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ నెల 1వ తేదీన విజయ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్తను అత్తింటి వారే దాచి పెట్టారని ఆరోపిస్తూ విజయ మంగళవారం ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకుని ట్రైనీ ఎస్‌ఐ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ నెల 11వ తేదీలోపు కిరణ్‌రెడ్డిని అప్పగిస్తామని వారి తల్లిదండ్రి తెలిపారని వివరించారు. బాధితురాలికి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించింది. విజయకు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి.
Advertisement
Advertisement