
రేవంత్‌రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి పట్టింపు లేదు
ఆమనగల్లు రైతుదీక్ష సభలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రేవంత్ కుటుంబ సభ్యులు ఇటీవల వెయ్యి ఎకరాలు నొక్కేశారు
భూముల రేట్లు పెంచేందుకు అత్తగారి ఊరుకు పెద్ద రోడ్డు వేస్తున్నాడు
నిజాయితీగల మోసగాడు.. అన్నివర్గాల ప్రజలను మోసం చేశాడు
ఆమనగల్లు: ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ డ్రామా ఆడుతున్నారని, ఆయనకు రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి పట్టింపు లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ధ్వజమెత్తారు. ‘వెల్దండలో సీఎం రేవంత్‌రెడ్డికి 500 ఎకరాల భూమి ఉంది. ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల వెయ్యి ఎకరాలు నొక్కేశారు. మాడ్గుల ప్రాంతంలో భూముల రేట్లు పెంచేందుకు అత్తగారి ఊరుకు పెద్ద రోడ్డు వేస్తున్నాడు..’ అని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత 35 సార్లు ఢిల్లీ వెళ్లివచ్చాడని, కనీసం 35 పైసలు కూడా తేలేదని విమర్శించారు. కల్వకుర్తి నుంచి కొడంగల్‌కు వలస వెళ్లిన రేవంత్‌రెడ్డి అక్కడా, ఇక్కడా చేసిందేమీలేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన రేవంత్‌రెడ్డి పతనం కల్వకుర్తి నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో మంగళవారం నిర్వహించిన రైతు నిరసన దీక్షకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
రేపు పుస్తెల తాళ్లు ఎత్తుకెళతారు..
‘కొడంగల్‌లో ఏ ఒక్క రైతుకూ రుణమాఫీ కాలేదు. మహిళలకు రూ.2,500 పెన్షన్ ఇవ్వలేదు. కళ్యాణలక్ష్మి, తులం బంగారం పత్తాలేదు. ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. కేసీఆర్ పాలనలో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు ఇక్కడికి వలస వస్తే.. ప్రస్తుతం ఇక్కడి నుంచి వలస పోవాల్సి వస్తోంది. కాంగ్రెస్ పాలనలో మొన్న రైతుల ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు. నిన్న మోటార్టు, స్టార్టర్లు తీసుకెళ్లారు. రేపు మహిళల మెడలో నుంచి పుస్తెల తాళ్లు ఎత్తుకెళ్తారు. కేసీఆర్ పాలనలో రైతులను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు.
70 లక్షల మంది రైతులకు రైతుబంధు కింద 12 సీజన్లలో రూ.73 వేల కోట్లు అందాయి. కానీ రేవంత్‌రెడ్డి 420 రోజుల పాలనలో 430 మంది రైతులు, 56 మంది గురుకుల పాఠశాలల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నాగర్‌కర్నూల్‌లో చందు అనే రైతు బ్యాంకు ఎదుట బైక్‌ను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లో రైతు జాదవరావ్, మేడ్చల్‌లో సురేందర్‌రెడ్డి ఆత్మహత్యలు చేసుకోగా ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు..
42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను, రూ.15 వేలు రైతు భరోసా ఇస్తానని రైతులను, రూ.12 వేలు ఇస్తానని రైతు కూలీలను, నెలకు రూ.2,500 ఇస్తానని ఆడబిడ్డలను, స్కూటీలు ఇస్తానని యువతులను, లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇస్తానని ఆడబిడ్డలను ఇలా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను రేవంత్‌రెడ్డి మోసం చేశారు. రాష్ట్ర ప్రజలు రేవంత్‌రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇంకెవరైనా అయితే ఇప్పటికే పాడుబడిన బావిలో దూకేవారు. కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదు. రేవంత్‌రెడ్డి నిజాయితీగల మోసగాడు..’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతు దీక్షలో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, వాణిదేవి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్ధన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, బాల్క సుమన్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్ ప్రవీన్‌కుమార్, గోలి శ్రీనివాస్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment