అభివృద్ధి చేసిందే కాంగ్రెస్‌ | Tpcc Uttam Kumar Reddy Fires On CM KCR | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చేసిందే కాంగ్రెస్‌

Published Tue, Oct 1 2019 5:07 AM | Last Updated on Tue, Oct 1 2019 5:07 AM

Tpcc Uttam Kumar Reddy Fires On CM KCR - Sakshi

హుజూర్‌నగర్‌ రూరల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే హుజూర్‌నగర్‌లో అభివృద్ధి జరిగిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. సోమవారం హుజూర్‌నగర్‌ పబ్లిక్‌ క్లబ్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన తాను రూ.2వేల కోట్లతో అభివృద్ధి పనులు చేయించానని చెప్పారు. మట్టపల్లిలో హై లెవెల్‌ వంతెనను రూ.50 కోట్లతో కట్టిస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం రూ.50 లక్షలతో అప్రోచ్‌ రోడ్డు వేయకుండా, బ్రిడ్జిని ప్రారంభించకుండా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అలాంటి వారు మేమే అభివృద్ధి పనులు చేశామంటూ ప్రజల్లోకి వెళితే ఛీ కొడుతున్నారని చెప్పారు. హుజూర్‌నగర్‌లో రూ.200 కోట్లతో 4వేల ఇళ్లు 80 శాతం పూర్తి చేస్తే, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి ఆరేళ్లయినా 20 శాతం పనులు పూర్తి చేయలేదని, నిరుపేదలకు ఇళ్లు పంపిణీ చేయలేదన్నారు.  

కాంగ్రెస్‌దే గెలుపు.. 
మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్‌లు 700 మంది వచ్చి టీఆర్‌ఎస్‌ తరఫున ప్రచారం చేసినా గెలుపు కాంగ్రెస్‌దేనని ఉత్తమ్‌ అన్నారు. అభివృద్ధి చేసిన కాంగ్రెస్‌ పార్టీనే ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారన్నారు. అధికార పార్టీ వారు పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తానని చెప్పి పది నెలలు దాటినా ఇంత వరకు అతీగతి లేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులను కుక్క తోకతో పోలి్చన కేసీఆర్‌కు ప్రజలు, కార్యకర్తలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు.  

అప్పులతో తాకట్టు..: కోమటిరెడ్డి 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భారీగా అప్పులు చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టే దుస్థితి తెచి్చందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైరల్‌ ఫీవర్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తన కుక్క చనిపోయిం దని డాక్టర్‌ రంజిత్‌కుమార్‌పై కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన కేసీఆర్‌కు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధం గా ఉన్నారన్నారు. తామిద్దరం ఎంపీలం కలసి హుజూర్‌నగర్‌కు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ని గెలిపిస్తే నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం అసెంబ్లీలో కేసీఆర్‌ను నిలదీస్తామన్నారు. 52 ఏళ్ల క్రితమే 50 లక్షల ఎకరాలకు సాగునీరందించిన ఘనత కాంగ్రెస్‌దేనని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ, జాతీయ ఉపాధి హామీ పథకం లాంటివి కాంగ్రెస్‌ హయాంలోనే జరిగాయన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంటు మల్లు భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి, కర్ణాటక ఎమ్మెల్సీ సలీం అహ్మద్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్యే సీతక్క, హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మావతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ నేతలు భయంతో వణికిపోతున్నారు
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచి్చన ఆరేళ్లలో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో చేసిన ఒక్క అభివృద్ధి పనిని చూపించినా పోటీ నుంచి కాంగ్రెస్‌ తప్పుకుంటుందని ఉత్తమ్‌ చెప్పారు. హుజూర్‌నగర్‌ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సోమవారం ఆయన ఫేస్‌బుక్‌లో కాంగ్రెస్‌ కేడర్‌నుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2009లో తాను తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో విద్యుత్‌ సమస్య నుంచి బయటపడేశామని, నియోజకవర్గ వ్యాప్తంగా 130 కేవీ, 13/11 కేవీ ఉప సబ్‌స్టేషన్లు 12 ఏర్పాటు చేయించామన్నారు. తన హయాంలోనే నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల వచి్చందని, 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశామని చెప్పారు. నేరేడుచర్ల–కోదాడ–ఖమ్మం రోడ్డును ఫోర్‌లైన్‌గా విస్తరించామన్నారు. టీఆర్‌ఎస్‌ హయాం లో నియోజకవర్గంలో చెప్పుకోదగిన ఒక్క అభివృద్ధి పని జరగలేదని, అందుకే ఓటమి భయంతో టీఆర్‌ఎస్‌ నేతలు వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు. శాంతియుత ప్రాం తంగా పేరొందిన నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నేతలు భయోత్పాతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ప్రజలు ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాపాడేందుకు సీపీఐ తమకు మద్దతు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఎం, టీడీపీలు కూడా పోటీ నుంచి వైదొలగి కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఉత్తమ్‌ కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement