సాక్షి, హైదరాబాద్: హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే అయినా బీజేపీ, టీటీడీపీ, సీపీఎం అభ్యర్థులతో పాటు తెలంగాణ ఇంటి పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి కూడా బరిలోకి దిగుతున్నారు. ఆయా అభ్యర్థులకు పడే ఓట్లు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లలో ఎవరికి నష్టం చేస్తాయన్న దానిపై అప్పుడే లెక్కలు మొదలయ్యాయి. మరోవైపు ఖచ్చితంగా కాంగ్రెస్‌కు అండగా నిలుస్తుందని భావించిన సీపీఐ కూడా ఇప్పుడు ఊగిసలాటలో పడటం, టీఆర్‌ఎస్ నేతలు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి మద్దతు అభ్యర్థించడం హుజూర్‌నగర్ రాజకీయాన్ని మరింత రక్తికట్టిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలు, సామాజిక వర్గాల వారీగా ఓట్లను ప్రోది చేసుకునే పనిలో రెండు ప్రధాన పక్షాలు ఇప్పటికే బిజీ అయిపోయాయి. ఇక, ప్రచార పర్వంలో రెండు పార్టీలు పోటాపోటీగా ముందుకెళుతుండగా, అధికార పార్టీ తన బలగాన్ని పూర్తిగా అక్కడే మోహరించింది. కాంగ్రెస్ ప్రస్తుతానికి ఉత్తమ్ చరిష్మాతోనే ప్రచారంలోకి వెళుతున్నా.. ఈ 20 రోజుల పాటు పెద్దెత్తున పార్టీ కీలక నేతలను రంగంలోకి దింపనుంది.
సామాజిక వర్గాలవారీగా లెక్కలు...
హుజూర్‌నగర్‌లో సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే రెడ్డి, లంబాడీ, ఎస్సీ (మాదిగ), గౌడ్, యాదవ, మున్నూరు కాపు సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. ఈ సామాజిక వర్గాల ఓట్లు అన్నీ కలిపి 1.25 లక్షల వరకు ఉంటాయని అంచనా. దీంతో ఆయా సామాజిక వర్గాలను టార్గెట్ చేసుకుని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. పెరిక, కమ్మ, వెలమ సామాజిక వర్గాలకు కలిపి 20వేల ఓట్ల వరకు ఉంటాయనే అంచనా నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాల నుంచి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండటంతో ఆ ఓట్లు ఏమవుతాయి? అందులో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లలో ఎవరికి నష్టం జరుగుతుందన్నది గెలుపోటములపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. బీసీల ఓట్లు 80వేలకు పైగా ఉన్న ఈ నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాల ప్రజలు ఎటు మొగ్గుచూపితే అటు విజయావకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బీసీల ఓట్లను కొల్లగొట్టేందుకు రెండు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికలో ప్రతి ఓటూ కీలకమే కావడంతో ఆ రెండు పార్టీలు ఇతర అభ్యర్థులతో తమకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
తేలిన అభ్యర్థులు..
ఈ ఎన్నికల్లో పలు పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే నిర్ణయించగా, బీజేపీ, సీపీఎం, టీటీడీపీ తమ అభ్యర్థులను ఆదివారం అధికారికంగా ప్రకటించాయి. బీజేపీ నుంచి డాక్టర్ కోట రామారావు, సీపీఎం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన పారేపల్లి శేఖర్‌రావు, టీటీడీపీ అభ్యర్థిగా నియోజకవర్గ ఇన్‌చార్జి చావా కిరణ్మయిలను ఆయా పార్టీలు ప్రకటించాయి. వీరంతా నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీజేఎస్, సీపీఐ ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించాయి. సీపీఐ మద్దతు కోరుతూ టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఆదివారం మఖ్దూం భవన్‌కు వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీపీఐ నేతలను కలిసి మద్దతు అభ్యర్థించిన నేపథ్యంలో రేపు ఆ పార్టీ తీసుకోనున్న నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక, టీజేఎస్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అయితే, ఈ ఎన్నికల్లో తాము క్రియాశీల పాత్ర పోషిస్తామని, ఎవరికి మద్దతిస్తామన్నది నేడో, రేపో ప్రకటిస్తామని కోదండరాం వెల్లడించారు. అభ్యర్థులు తేలడంతో సోమవారమంతా హుజూర్‌నగర్‌లో నామినేషన్ల కోలాహలం నెలకొననుంది. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి ఇప్పటికే ఓ సెట్ నామినేషన్ దాఖలు చేసినా నేడు పెద్దెత్తున కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆమె మరో సెట్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. బీజేపీ, టీటీడీపీ, సీపీఎంలు కూడా సోమవారమే నామినేషన్లు దాఖలు చేయనున్నాయి.
నేనే చేశా... లేదు మేమే చేశాం
నియోజకవర్గ అభివృద్ధి కూడా ఈసారి ఎన్నికల్లో ప్రధానాంశమవుతోంది. ముఖ్యంగా హుజూర్‌నగర్‌లో అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందన్న దానిపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పోటాపోటీగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఉత్తమ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాలంలో నియోజకవర్గంలో రోడ్లు, విద్యుత్, ఇళ్లు, ఎత్తిపోతల పథకాల విషయంలో మంచి అభివృద్ధి జరిగిందనే అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉంది. దీంతో తానే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, టీఆర్‌ఎస్ హయాంలో ఏం జరగలేదని ఆయన చెప్పుకుంటున్నారు. రైతుబంధు లాంటి బృహత్తర సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు అధికారంలో ఉన్నది తామే కనుక తాము గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని టీఆర్‌ఎస్ చెబుతోంది. దీనికి తోడు రెండు పార్టీల మధ్య వ్యక్తిగత విమర్శలు కూడా తీవ్రతరమవుతున్నాయి. టీఆర్‌ఎస్ నేతల ఆగడాలపై ఆరోపణలు, పేకాట క్లబ్బులు, బలవంతంగా పార్టీల్లోకి మార్పు లాంటి అంశాలు కూడా ఈ ఎన్నికలను రక్తికట్టిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌లోకి వలసలు కూడా పెరగడంతో కాంగ్రెస్‌లో కొంత గుబులు మొదలైంది. అయితే, టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన వారు కొందరు మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తుండటంతో ఉత్తమ్ శిబిరం కొంత ఊపిరి పీల్చుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment