45..నామినేషన్ల తిరస్కరణ | 45 Nominations Rejected In Huzurnagar Bye Election 2019 | Sakshi
Sakshi News home page

45..నామినేషన్ల తిరస్కరణ

Published Wed, Oct 2 2019 8:15 AM | Last Updated on Wed, Oct 2 2019 8:15 AM

45 Nominations Rejected In Huzurnagar Bye Election 2019 - Sakshi

హుజూర్‌నగర్‌లో ఎన్నికల నామినేషన్‌ కేంద్రం వద్ద కోలాహలం

సాక్షి, సూర్యాపేట: హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన తంతు పూర్తయింది. హోరాహోరీగా జరిగిన నామినేషన్ల పర్వంలో పలు కారణాలతో 45మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు.  31మంది అభ్యర్థుల నామినేషన్లను అంగీకరించారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో సీపీఎం అభ్యర్థికి ఊహించని షాక్‌ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావు నామినేషన్‌ను తిరస్కరణకు గురైంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. గురువారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎంత మంది అభ్యర్థులు
ఉపపోరు బరిలో ఉండనున్నారో తేలనుంది. 

మిగిలింది.. 31మంది అభ్యర్థులు..
ఉప ఎన్నికలో బరికి 76మంది అభ్యర్థులు మొత్తం 119నామినేషన్‌ సెట్లు వేశారు. ఇందులో ఒక్కొక్కరు నాలుగు సెట్ల చొప్పున ఏడుగురు, ఐదుగురు మూడు సెట్లు, 12మంది రెండు సెట్ల చొప్పున, మిగతా అభ్యర్థులు ఒక్కో సెట్‌ నామినేషన్‌ వేశారు. అఫిడవిట్‌ సరిగా నింపలేదని, సంతకాలు చేయలేదని, కావాల్సిన పత్రాలు జత చేయలేదని, ఇలా పలు కారణాలతో 45మంది అభ్యర్థుల నామినేష్లు తిరస్కరించారు. అన్ని సరిగా ఉండడంతో 31మంది అభ్యర్థుల నామినేషన్లకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చంద్రయ్య ఆమోదం తెలిపారు. ప్రధాన రా జకీయ పార్టీల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డి, బీజేపీ నుంచి డాక్టర్‌ కోట రామారావు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సై దిరెడ్డి, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి మేడి రమణ,  తెలం గాణ ఇంటిపార్టీ మద్దతుతో బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి, తెలంగాణ ప్రజా పార్టీ అభ్యర్థి సాం బశివరావుగౌడ్‌ నామినేషన్లు అంగీకరించారు.

ఇండిపెండెంట్లు.. ఇతర పార్టీలు..
ఇండిపెండెంట్లు ఇతర పార్టీల వారీగా చిలువేరు శ్రీకాంత్, మేఖల రఘుమారెడ్డి, మారం వెంకట్‌రెడ్డి, వంగపల్లి కిరణ్, నందిపాటి జానయ్య, మేకల వెంకన్న, అజ్మీరా మహేష్, శాంతిదసరాం నాయక్, భూక్యా కృష్ణానాయక్, సపావత్‌ సుమన్, అలదాసు సుధాకర్, కొప్పుల ప్రతాప్‌రెడ్డి, రేఖల సైదులు, గుగులోతు శంకర్, ఆరెపు వివేకానంద, తంగిళ్ల జనార్దన్, బండారు నాగరాజు, జాజుల భాస్కర్, వీసం రాములు, పి.క్రాంతికుమార్, పాండుగౌడ్, రాయల సుమన్, ఎం. సుదర్శన్, నందిపాటి వినోద్‌కుమార్‌ల నామినేషన్లు ఆమోదం పొందిన ట్లు సమాచారం. అలాగే సర్పంచ్‌ల ఫోరం నుంచి నామినేషన్‌ వేసిన వారిలో నాగర్‌కర్నూల్‌ జిల్లా తండ్రికల్‌ సర్పంచ్‌ తాళ్ల పాండుగౌడ్‌ నామినేషన్‌ ఒక్కటే ఆమోదం పొందింది. 

నామినేషన్లు తిరస్కరించిన వారిలో..
రాజకీయ పార్టీల వారీగా చూస్తే సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావు నామినేషన్‌ తిరస్కరించారు. దీంతో శేఖర్‌రావుతో పాటు ఆ పార్టీ నాయకులు నామినేషన్‌ కేంద్రం వద్ద ధర్నా చేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఎన్నికల పరిశీలకులు సచింద్రప్రతాప్‌సింగ్‌ రావడంతో.. తిరస్కరణకు గురై అభ్యంతరం చెప్పిన అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లు మరో సారి పరిశీలించాలని ఎన్నికల అధికారులకు చెప్పారు. పలు కారణాలతో చివరకు శేఖర్‌రావు నామినేషన్‌ తిరస్కరించారు. 

బలమైన ఇండిపెండెంట్లపై నజర్‌..
నామినేషన్లు ఆమోదం పొందిన వారిలో బలమైన అభ్యర్థులు ఎవరని ప్రధాన పార్టీలు ఆరా తీస్తున్నాయి. వారిని తమ వైపునకు తిప్పుకుంటే కొన్నైనా ఓట్లు రాలుతాయని ప్రధాన పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే వారికి వచ్చిన ఓట్లు ఎన్ని, ఇప్పుడు ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉందని.. లెక్కలు వేస్తున్నారు. వారి మద్దతు తమకుంటే గెలుపునకు కొంతైనా దోహదం అవుతుందని అభ్యర్థులు వారిపై నజర్‌ పెట్టించారు. ఉప బరి ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుండడంతో ఎవరు గెలిచినా మెజార్టీ అంత ఎక్కువ ఉండదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇండిపెండెంట్లు ఈ ఎన్నికల్లో కీలకమయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement