
సాక్షి, హైదరాబాద్:మంత్రి పదవిని సాధించేందుకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిననాటి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని గవర్నర్ దృష్టికి తెచ్చారు. రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తున్న గుత్తా నుంచి రాజీనామా కోరాలని గవర్నర్‌కు విన్నవించారు. ఈ మేరకు ఉత్తమ్ శుక్రవారం గవర్నర్‌కు లేఖ రాశారు. ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిస్తే మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డిల స్థానంలో తనను మంత్రిని చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారంటూ కాంగ్రెస్ నేతలకు చెబుతున్నారని పేర్కొన్నారు. సుఖేందర్‌రెడ్డి కుమారుడు, వియ్యంకుడు చేస్తున్న కాంట్రాక్టుల విషయాన్ని ఉత్తమ్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎగువసభకు చైర్మన్‌గా ఉన్న వ్యక్తి కాంట్రాక్టుల్లో భాగస్వామి అయితే మండలిలో వీటిపై చర్చించడం సాధ్యమేనా? అని ఉత్తమ్ ప్రశ్నించారు.