నల్లగొండలోని కోట మైసమ్మ ఆలయంలో చిహ్నాలు చూపిస్తున్న చరిత్రకారులు
రామగిరి (నల్లగొండ): తమిళనాడులోని కంచి పాలకుడైన 3వ వీరభల్లాలుడి శాసన చిహ్నాలు నల్లగొండలో వెలుగు చూశాయి. కొత్త చరిత్ర బృందం సభ్యుడు చిక్కుళ్ల యాదగిరి ఇటీవల నల్లగొండ పాతబస్తీలో ఉన్న కోట మైసమ్మ ఆలయంలోని ఏకశిల రాతిపలకను శుభ్రం చేసి పరిశీలించగా భైరవుడు, గండభేరుండం, పులి శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఈ రాతిపలకం ఫొటోలను ప్రముఖ చరిత్రకారుడు రామోజు హరగోపాల్‌కు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు యాదగిరి, సత్తయ్య, సట్టు నారాయణ, ఆమనగంటి వెంకన్న, నాగిళ్ల చక్రపాణి పంపగా భైరవుడు శైవమతానికి గుర్తయితే, గండభేరుండం వైష్ణవ మతచిహ్నమని, పులి రాజరికానికి, వీరత్వానికి ప్రతీక అని ఆయన వివరించారు.
కంచి పాలకుడైన 3వ హోయసల వీరభల్లాలుడి శాసనాల మీద గండభేరుండం, పులి బొమ్మలు కనిపిస్తుంటాయని హరగోపాల్ తెలిపారు. తమిళనాడులోని భల్లాలుడి రాజ్యానికి తెలంగాణలోని నల్లగొండ పట్టణానికి 500 నుంచి 600 కిలోమీటర్ల దూరం ఉందని, ఇక్కడ కూడా ఆయన ప్రాతినిధ్యం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వీరభల్లాలుడిని, అతని మిత్రులు శాంబువరాయుణ్ణి, చంద్రగిరి యాదవరాయుడిని కాకతీయ సేనాని రుద్రుడు ఓడించి కంచిని కాకతీయ సామ్రాజ్యంలో కలిపాడని పేర్కొన్నారు. ఇవి నల్లగొండ జిల్లా కేంద్రంలోని కాపురాలగుట్ట ముందు కనిపించాయని పేర్కొన్నారు. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం వీరభల్లాలుడు కాపయనాయకుడితో కలసి యుద్ధా ల్లో పాల్గొన్నట్లు ఆధారాలున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment