Historic Places
-
నల్లగొండలో అద్భుతం: ‘కంచి’ శాసనచిహ్నాలు
రామగిరి (నల్లగొండ): తమిళనాడులోని కంచి పాలకుడైన 3వ వీరభల్లాలుడి శాసన చిహ్నాలు నల్లగొండలో వెలుగు చూశాయి. కొత్త చరిత్ర బృందం సభ్యుడు చిక్కుళ్ల యాదగిరి ఇటీవల నల్లగొండ పాతబస్తీలో ఉన్న కోట మైసమ్మ ఆలయంలోని ఏకశిల రాతిపలకను శుభ్రం చేసి పరిశీలించగా భైరవుడు, గండభేరుండం, పులి శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఈ రాతిపలకం ఫొటోలను ప్రముఖ చరిత్రకారుడు రామోజు హరగోపాల్‌కు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు యాదగిరి, సత్తయ్య, సట్టు నారాయణ, ఆమనగంటి వెంకన్న, నాగిళ్ల చక్రపాణి పంపగా భైరవుడు శైవమతానికి గుర్తయితే, గండభేరుండం వైష్ణవ మతచిహ్నమని, పులి రాజరికానికి, వీరత్వానికి ప్రతీక అని ఆయన వివరించారు. కంచి పాలకుడైన 3వ హోయసల వీరభల్లాలుడి శాసనాల మీద గండభేరుండం, పులి బొమ్మలు కనిపిస్తుంటాయని హరగోపాల్ తెలిపారు. తమిళనాడులోని భల్లాలుడి రాజ్యానికి తెలంగాణలోని నల్లగొండ పట్టణానికి 500 నుంచి 600 కిలోమీటర్ల దూరం ఉందని, ఇక్కడ కూడా ఆయన ప్రాతినిధ్యం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వీరభల్లాలుడిని, అతని మిత్రులు శాంబువరాయుణ్ణి, చంద్రగిరి యాదవరాయుడిని కాకతీయ సేనాని రుద్రుడు ఓడించి కంచిని కాకతీయ సామ్రాజ్యంలో కలిపాడని పేర్కొన్నారు. ఇవి నల్లగొండ జిల్లా కేంద్రంలోని కాపురాలగుట్ట ముందు కనిపించాయని పేర్కొన్నారు. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం వీరభల్లాలుడు కాపయనాయకుడితో కలసి యుద్ధా ల్లో పాల్గొన్నట్లు ఆధారాలున్నాయని చెప్పారు. -
శతాబ్దాల బాంధవ్యం
ఆగ్నేయాసియాతో భారతదేశం సుదీర్ఘకాలంగా సాంస్కృతిక, రాజకీయ, వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. ఈ ప్రాంతమంతటా భారతీయ ప్రభావాన్ని మనం చూడవచ్చు. కానీ ప్రస్తుత తరం ఆగ్నేయాసియా ప్రజలకు భారతీయుల గురించి, ప్రస్తుత తరం భారతీయులకు ఆగ్నేయాసియా ప్రజల గురించి చాలా తక్కువగానే తెలిసి ఉండటం దురదృష్టకరమైంది. అమెరికా, యూరప్ చరిత్ర గురించి మనకు బాగానే తెలుసు. పైగా గులాబీ యుద్ధం జరిగిన చోటు, బ్రిటిష్ రాజుల సమాధి స్థలాలు వంటి పాశ్చాత్య దేశాల్లోని అప్రాధాన్య ప్రాంతాలను సందర్శించడానికే ఎక్కువ ఆసక్తి చూపుతుంటాం కానీ, భారతదేశం నుంచి ఆగ్నేయాసియా వారసత్వంగా స్వీకరించిన హిందూ, బౌద్ధ చారిత్రక నిర్మాణాల గురించి మర్చిపోయాం. ఇండోనేషియాలోకి ఇస్లాం మతం కత్తితో కాకుండా వ్యాపారంతో విస్తరించింది. మతాన్ని తమతో పాటు ఇక్కడికి తీసుకొచ్చిన వ్యాపారులు అప్పటికే ఉన్న హిందూ, బౌద్ధ సంస్కృతి నుంచి ఇస్లాం మతానికి శాంతియుతంగా పరివర్తన చేశారు. అందుకే సీతా అనే అమ్మాయి ఇస్లాం మతాన్ని ఆచరించే అరుదైన దృశ్యం ఇండోనేషియాలోనే కనిపిస్తుంది. హిందూ మతంతో ముడిపడిన అనేక పౌరాణిక గాథలు వీరికి తెలుసు. నా పర్యటనలో నేను పాల్గొన్న శిక్షణా కార్యక్రమానికి పలు ఆగ్నేయాసియా దేశాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ చర్చలో పాల్గొన్న వివిధ దేశాల ప్రతినిధులు తమ భాషలోని అక్షరాలు భారతీయ అక్షరమాలనే పోలి ఉంటాయని, వలసపాలనలోనే రోమన్ అక్షరాలు తమ అక్షరమాల స్థానంలో వచ్చి చేరాయన్నారు. నా పర్యటనలో భాగంగా యోగ్యకర్త పట్టణం (సౌభాగ్యనగరం అని అర్థం) సందర్శించాను. ఇది కూడా సంస్కృతపదమే. ఇక్కడే బోరోబుదుర్ అనే అద్భుతమైన ఆలయం ఉంది. ఇది 9వ శతాబ్దానికి చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ దేవాలయం. యోగ్యకర్త పట్టణంలో దక్షిణభారత శిల్పశైలిని ప్రతి బింబించే అద్భుతమైన ఆలయాలను చూడవచ్చు. ఇండోనేషియాలో బౌద్ధం నిర్వహించిన ముఖ్య పాత్రకు బోరోబుదుర్ నిర్మాణాలు నిదర్శనాలు. అలాగే ఆ దేశ సాంస్కృతిక వారసత్వంలో రామాయణ జానపద గా«థలు ఓ అంతర్భాగం. ఆగ్నేయాసియాతో భారత్‌కున్న సన్నిహిత సాంస్కృతిక బాంధవ్యాలకు మరో చక్కటి నిదర్శనం కాంబోడియాలోని అంగ్కోర్ వాట్ ఆలయం. బోరోబుదుర్లో శిలలపై బుద్ధుడి జీవిత విశేషాలను చిత్రించినట్లుగానే, అంగ్కోర్ వాట్ ఆలయ శిలలపై వాటితోపాటు భీష్ముడి అంపశయ్య వివరాలను అత్యద్భుతంగా చిత్రించారు. ఈ ప్రాంతంలోని అనేక దేశాలు తమ ప్రాచీన రాజులు భారతీయ రాజరికపు కుదురు నుంచి వచ్చారని చెబుతుంటాయి. క్రీస్తుశకం తొలి శతాబ్దంలోనే అయోధ్యకు చెందిన కొందరు రాజకుమారిలు తమ దేశ చక్రవర్తిని పెళ్లాడారని కొరియన్ల విశ్వాసం. కొరియా పురాణాలు దీన్ని బలపరుస్తున్నాయి. ఈ కాలంలోనే కాంబోడియాలో నెలకొన్న ఒక సామ్రాజ్యానికి భారతీయ మూలాలున్నట్లు అక్కడి పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో బౌద్ధమతం వ్యాప్తిద్వారా భారత్‌తో మతపరమైన సంబంధాలు మరింతగా బలపడ్డాయి. దక్షిణ భారతంతోపాటు కళింగ రాజులు కూడా ఈ ప్రాంతంతో వాణిజ్య సంబంధాలు పెంపొందించుకున్నారు. బొరోబుదుర్ మహా శిల్ప నిర్మాణం ముందు, అంగ్కోర్ వాట్ అద్భుత దేవాలయం ముందు నిలబడినప్పుడు కలిగేటంత అనుభూతిని ఏ ఇతర దేశాన్ని కానీ లేక యూరప్ చారిత్రక నిర్మాణాలను, అమెరికా సహజ సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు పొందలేం. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఈ దేశాలకు తక్కువ ఖర్చుతోనే మనం పర్యటించవచ్చు. వాణిజ్య అవసరాల ప్రాతిపదిక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లుక్ ఈస్ట్ పాలసీని భారత ప్రజలకు ఆ ప్రాంతంతో ఉన్న చారిత్రక, సాంస్కృతిక అనుసంధాలను మరింత బలపర్చేవిధంగా మెరుగుపర్చాలి. అలాగే ఇరుప్రాంతాల ప్రజల మధ్య సంబంధాలను పెంచేవిధంగా పర్యాటక సంస్కృతిని మరింతగా పెంపొం దించాలి. భారతీయ ఉపఖండంతో ఈ ప్రాంతానికి ఉన్న సుదీర్ఘ చారిత్రక బాంధవ్యాన్ని ప్రజలు మరిం తగా తెలుసుకునేలా తగు చర్యలు తీసుకోవాలి. ఐవైఆర్ కృష్ణారావు : వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి -
టూర్ వెళ్లొద్దాం ఇలా..
సాక్షి, సిటీబ్యూరో: ప్రతి మనిషికి నిత్యం ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఇంటి బాధ్యతలు.. ఆఫీసు.. పిల్లలకు స్కూలు, కాలేజీ.. ఇలా చాలానే ఉంటాయి. ఎప్పుడూ ఒకేలా ఉండే జీవితం కొంత మార్పు కోరుకోవడం సహజం. చేస్తున్న పనికి విరామం ఇచ్చి ఎక్కడైనా వెళ్లి ఆనందంగా గడిపి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రత్యేకించి నేటి ‘స్పీడ్’ యుగంలో ప్రతి మనిషి యాంత్రిక జీవనం నుంచి బయటపడి కొన్ని రోజులైనా సరదాగా గడపడం అవసరం కూడా. కుటుంబమంతా జాలీ ట్రిప్ వేసేందుకు ఈ వేసవి కాలమే సరైన సమయం. ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న ప్రదేశానికి వెళ్లి రావద్దామనుకుంటారు. ఈ సమయంలో కొంచెం ప్లాన్‌తో సిద్ధమైతే టూర్‌ను బాగా ఎంజాయ్ చేయవచ్చు. కలిసి చర్చించుకుంటే మేలు.. ఏ ప్రాంతానికి వెళ్లాలనుకుంటున్నారో.. ఆ ప్రదేశం గురించి కుటుంబ సభ్యులంతా కలిసి చర్చించుకొని ఏకాభిప్రాయానికి రండి. వెళ్లనున్న చోటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని, బడ్జెట్ వేసి ఖర్చులు అంచనాకు సరిపోతుందో లేదో చూడండి. అంతా ఓకే అనుకున్నాక కొన్ని రోజుల ముందే రెండు వైపులా టికె ట్లు రిజర్వేషన్ చేయించుకుంటే ట్రిప్‌లో సగం సమస్యలు తీరిపోతాయి. బయలుదేరే ముందు.. వెళుతున్న ప్రదేశంలో దొరికే ఆహారం గురించి అప్పటికే ఒక అవగాహన ఉంటుంది. కనుక తదనుగుణంగా సిద్ధమవ్వాలి. పిల్లలు, వృద్ధులు కూడా ప్రయాణంలో ఉన్నప్పుడు వారిని అవసరమైన మందులు మర్చిపోవద్దు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వెంట ఉండాల్సిందే. ఊరు వెళుతున్న సమాచారాన్ని సన్నిహితులకు, ఇరుగు పొరుగువారికి తెలియజేయడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని బట్టి సమీప పోలీస్ స్టేషన్లో కూడా తెలియజేయడం తప్పనిసరి. అకస్మాత్తుగా గాలి మార్పు, నీటి మార్పు వలన కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయంలో వైద్యుడిని సంప్రదించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం గడిపిన జాలీడేస్ని పదిలపరచుకోవడం కోసం కెమెరా, వీడియో ఉంటే మంచిది. కొన్ని చోట్ల సుదీర్ఘమైన ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వాటి గురించి కూడా ముందే తెలుసుకుని అందుకు తగ్గట్టు ప్రయాణంలో బోర్ కొట్టకుండా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి ఖర్చుకు లెక్క ఉండాల్సిందే.. టూర్ సరికొత్త అనుభూతుల్ని పంచాలంటే ఉన్న సమస్యలను ఇంటి వద్దే మర్చిపోతే ఆనందంగా గడపవచ్చు. ఖర్చులకు అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువ డబ్బులు తీసుకెళ్లండి. పరిస్థితిని బట్టి క్రెడిట్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్‌ను వినియోగించండి. చేసిన ప్రతి ఖర్చుకు లెక్క రాయండి. హోటల్లోని రూమ్‌లలో టైం వేస్ట్ చేయకుండా వీలైనంత సేపు సీయింగ్‌లో గడపండి. వీలైతే ఒక డైరీలో మీ ప్రయాణపు అనుభూతుల్ని అక్షరం బద్దం చేయండి. చారిత్రక ప్రదేశాలకు వెళ్లినప్పుడు వాటి గురించి పిల్లలకు వివరించండి. మీ టూర్ ప్లాన్‌కి ఏదైనా వివరాలు అవసరమైతే టీఎస్‌టీడీసీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. 040- 29801039/40, 9848540371, 9848125720, 040-23450165 నంబర్లలో సంప్రదిస్తే పర్యాటక ప్రాంతాల వివరాలు అందిస్తారు. లేదా ఐఆర్సీటీసీ వెబ్సైట్లో కూడా పొందవచ్చు.