ఆగ్నేయాసియాతో భారతదేశం సుదీర్ఘకాలంగా సాంస్కృతిక, రాజకీయ, వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. ఈ ప్రాంతమంతటా భారతీయ ప్రభావాన్ని మనం చూడవచ్చు. కానీ ప్రస్తుత తరం ఆగ్నేయాసియా ప్రజలకు భారతీయుల గురించి, ప్రస్తుత తరం భారతీయులకు ఆగ్నేయాసియా ప్రజల గురించి చాలా తక్కువగానే తెలిసి ఉండటం దురదృష్టకరమైంది. అమెరికా, యూరప్ చరిత్ర గురించి మనకు బాగానే తెలుసు. పైగా గులాబీ యుద్ధం జరిగిన చోటు, బ్రిటిష్ రాజుల సమాధి స్థలాలు వంటి పాశ్చాత్య దేశాల్లోని అప్రాధాన్య ప్రాంతాలను సందర్శించడానికే ఎక్కువ ఆసక్తి చూపుతుంటాం కానీ, భారతదేశం నుంచి ఆగ్నేయాసియా వారసత్వంగా స్వీకరించిన హిందూ, బౌద్ధ చారిత్రక నిర్మాణాల గురించి మర్చిపోయాం.
ఇండోనేషియాలోకి ఇస్లాం మతం కత్తితో కాకుండా వ్యాపారంతో విస్తరించింది. మతాన్ని తమతో పాటు ఇక్కడికి తీసుకొచ్చిన వ్యాపారులు అప్పటికే ఉన్న హిందూ, బౌద్ధ సంస్కృతి నుంచి ఇస్లాం మతానికి శాంతియుతంగా పరివర్తన చేశారు. అందుకే సీతా అనే అమ్మాయి ఇస్లాం మతాన్ని ఆచరించే అరుదైన దృశ్యం ఇండోనేషియాలోనే కనిపిస్తుంది. హిందూ మతంతో ముడిపడిన అనేక పౌరాణిక గాథలు వీరికి తెలుసు. నా పర్యటనలో నేను పాల్గొన్న శిక్షణా కార్యక్రమానికి పలు ఆగ్నేయాసియా దేశాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ చర్చలో పాల్గొన్న వివిధ దేశాల ప్రతినిధులు తమ భాషలోని అక్షరాలు భారతీయ అక్షరమాలనే పోలి ఉంటాయని, వలసపాలనలోనే రోమన్ అక్షరాలు తమ అక్షరమాల స్థానంలో వచ్చి చేరాయన్నారు.
నా పర్యటనలో భాగంగా యోగ్యకర్త పట్టణం (సౌభాగ్యనగరం అని అర్థం) సందర్శించాను. ఇది కూడా సంస్కృతపదమే. ఇక్కడే బోరోబుదుర్ అనే అద్భుతమైన ఆలయం ఉంది. ఇది 9వ శతాబ్దానికి చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ దేవాలయం. యోగ్యకర్త పట్టణంలో దక్షిణభారత శిల్పశైలిని ప్రతి బింబించే అద్భుతమైన ఆలయాలను చూడవచ్చు. ఇండోనేషియాలో బౌద్ధం నిర్వహించిన ముఖ్య పాత్రకు బోరోబుదుర్ నిర్మాణాలు నిదర్శనాలు. అలాగే ఆ దేశ సాంస్కృతిక వారసత్వంలో రామాయణ జానపద గా«థలు ఓ అంతర్భాగం.
ఆగ్నేయాసియాతో భారత్‌కున్న సన్నిహిత సాంస్కృతిక బాంధవ్యాలకు మరో చక్కటి నిదర్శనం కాంబోడియాలోని అంగ్‌కోర్ వాట్ ఆలయం. బోరోబుదుర్‌లో శిలలపై బుద్ధుడి జీవిత విశేషాలను చిత్రించినట్లుగానే, అంగ్‌కోర్ వాట్ ఆలయ శిలలపై వాటితోపాటు భీష్ముడి అంపశయ్య వివరాలను అత్యద్భుతంగా చిత్రించారు. ఈ ప్రాంతంలోని అనేక దేశాలు తమ ప్రాచీన రాజులు భారతీయ రాజరికపు కుదురు నుంచి వచ్చారని చెబుతుంటాయి. క్రీస్తుశకం తొలి శతాబ్దంలోనే అయోధ్యకు చెందిన కొందరు రాజకుమారిలు తమ దేశ చక్రవర్తిని పెళ్లాడారని కొరియన్ల విశ్వాసం. కొరియా పురాణాలు దీన్ని బలపరుస్తున్నాయి. ఈ కాలంలోనే కాంబోడియాలో నెలకొన్న ఒక సామ్రాజ్యానికి భారతీయ మూలాలున్నట్లు అక్కడి పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో బౌద్ధమతం వ్యాప్తిద్వారా భారత్‌తో మతపరమైన సంబంధాలు మరింతగా బలపడ్డాయి. దక్షిణ భారతంతోపాటు కళింగ రాజులు కూడా ఈ ప్రాంతంతో వాణిజ్య సంబంధాలు పెంపొందించుకున్నారు.
బొరోబుదుర్ మహా శిల్ప నిర్మాణం ముందు, అంగ్‌కోర్ వాట్ అద్భుత దేవాలయం ముందు నిలబడినప్పుడు కలిగేటంత అనుభూతిని ఏ ఇతర దేశాన్ని కానీ లేక యూరప్ చారిత్రక నిర్మాణాలను, అమెరికా సహజ సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు పొందలేం. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఈ దేశాలకు తక్కువ ఖర్చుతోనే మనం పర్యటించవచ్చు. వాణిజ్య అవసరాల ప్రాతిపదిక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లుక్ ఈస్ట్ పాలసీని భారత ప్రజలకు ఆ ప్రాంతంతో ఉన్న చారిత్రక, సాంస్కృతిక అనుసంధాలను మరింత బలపర్చేవిధంగా మెరుగుపర్చాలి. అలాగే ఇరుప్రాంతాల ప్రజల మధ్య సంబంధాలను పెంచేవిధంగా పర్యాటక సంస్కృతిని మరింతగా పెంపొం దించాలి. భారతీయ ఉపఖండంతో ఈ ప్రాంతానికి ఉన్న సుదీర్ఘ చారిత్రక బాంధవ్యాన్ని ప్రజలు మరిం తగా తెలుసుకునేలా తగు చర్యలు తీసుకోవాలి.
ఐవైఆర్ కృష్ణారావు : వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment