సాక్షి,జడ్చర్ల టౌన్: పోలింగ్ తేదీకి గడువు ఒక్కరోజే ఉండటంతో ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్కరినీ కలుస్తున్నారు. ఈనెల 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో తెరపడనుంది. మంగళవారం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్టుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్నాలకే పరిమితం కావాల్సివచ్చింది. ప్రధాన పార్టీ అభ్యర్థి డాక్టర్ లక్ష్మారెడ్డి మంగళవారం జడ్చర్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే అన్ని గ్రామాలను చుట్టివచ్చిన ఆయన, ప్రత్యర్థి వెళ్లిన గ్రామాల్లోనూ మరోసారి ప్రచారం నిర్వహించారు. ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్, టీడీపీల నుంచి పెద్దసంఖ్యలో పార్టీలోకి ఆహ్వానించిన ఆయన ప్రచారాన్ని బుధవారం ముగించనున్నారు. పార్టీ నాయకులు గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి సమావేశాలు, సదస్సులతోపాటు రాత్రి పొద్దుపోయే దాకా ప్రచారం కొనసాగిస్తున్నారు.
ముగిసిన ప్రచారం
అయితే మంగళవారం ప్రచారానికి కొంత ఆటంకం కలిగినట్లయ్యింది. రేవంత్ అరెస్టు, జడ్చర్ల శిక్షణ కేంద్రానికి తరలించటంతో కేంద్రం వద్దే రెండు గంటలు గడపాల్సివచ్చింది. అనంతరం ధర్నా, పోలీసుల అరెస్టుతో మంగళవారం ముగిసిపోయింది. అయితే రేవంత్ ఘటన కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసొచ్చే అంశంగా మారింది. మరో జాతీయ పార్టీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ మండల కేంద్రాలతోపాటు నియోజకవర్గంలోని ప్రధాన గ్రామాల్లో ప్రచారం ముగించేశారు. సమయం తక్కువగా ఉండటంతో ఓటర్లను పూర్తిస్థాయిలో కలవలేకపోయినప్పటికీ మోదీపై ఉన్న విశ్వాసంతో ఓట్లు ఆశిస్తున్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి డాక్టర్ అజయ్‌కుమార్, బీఎంపీ అభ్యర్థి దాస్‌రాంనాయక్ వారి శైలిలో ప్రచారం చేస్తున్నారు.
పట్టణంలో ర్యాలీలు
ఇక స్వతంత్ర అభ్యర్థి మర్పడగ రమేష్‌రెడ్డి మాత్రం మంది మార్బలంతో విస్తృత ప్రచారం గావించారు. మంగళవారం జడ్చర్ల, బాదేపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. టీబీఎస్పీ అభ్యర్థి ఆనంద్ ర్యాలీతోపాటు ఆయా గ్రామాల్లో వాహనాల ద్వారా ప్రచారం కొనసాగించారు. బీఎస్పీ అభ్యర్థి కొంగళి శ్రీకాంత్, సమాజ్‌వాది ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థి నర్సింగ్‌రావు ఆటోలు, సామాజిక మాద్యమాల ద్వారానే ప్రచారం ముగించేస్తున్నారు. శివసేన అభ్యర్థి నడిమింటి శ్రీనివాస్, ఎంఎల్ అభ్యర్థి ఎల్లయ్య రెండు రోజులుగా ప్రచారం ప్రారంభించారు. ఇలా అభ్యర్థులు తమ ప్రచారాలను బుధవారం నాటికి ముగించేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు.
జడ్చర్ల: గ్రామాల్లో విస్తృత ప్రచారం
Published Wed, Dec 5 2018 4:07 PM | Last Updated on Tue, Aug 27 2019 4:45 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment