బీ ఫారం...ఇప్పుడు అన్ని పార్టీలకూ బ్రహ్మపదార్థంగా మారిపోయింది. ముందుగానే ఎవరిచేతిలో పెడితే ఏం ముంచుకొస్తుందోనని హడలెత్తుతున్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు కమిటీల ముసుగు వేసినా చివరికి తేలేది..ఏ తిరుగుబాటుకు దారితీస్తోందనని అన్ని పక్షాలూ బెంబేలెత్తుతున్నాయి.
దీన్ని కప్పి పుచ్చుకునేందుకే అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నామని గంభీర ప్రకటనలు కురిపిస్తున్నారు. మరో వైపు చైర్మన్, ఎమ్మెల్యే ఆశావహులు కింది స్థాయిలో పరిస్థితులు తమకు అనుకూలంగా ఉండేలా తమవారిని నిలబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. మొత్తానికి అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలు తలబొప్పి కట్టిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వానికి మరో మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి కాకపోవడంతో ఆశావహులు పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అన్ని పార్టీలు కమిటీల పేరిట అభ్యర్థుల ఖరారు ప్రక్రియపై కసరత్తు చేస్తున్నాయి.
కొన్ని వార్డుల్లో బీ ఫారాల కోసం తీవ్రమైన పోటీ వుండటం, మరికొన్న చోట్ల గట్టి పోటీనిచ్చే అభ్యర్థులు లేకపోవడం అన్ని పార్టీలను కలవరానికి గురి చేస్తోంది. రిజర్వేషన్ అనుకూలంగా లేని చోట క్రియాశీల నాయకులు చెప్పిన వారికే టికెట్ల కేటాయింపులో పార్టీలు ప్రాతినిథ్యం ఇస్తున్నాయి. చైర్మన్, ఎమ్మెల్యే పదవి ఆశిస్తున్న నేతలు కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
తమకు అనుకూలమైన వారికే టికెట్ దక్కేలా పావులు కదుపుతున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న వార్డుల్లో ఎదుటి పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాతే తమ జాబితా వెలువరించాలనే వ్యూహం పార్టీలు అమలు చేస్తున్నాయి. అభ్యర్థులు దొరకని చోట మాత్రం ఎదుటి పార్టీల్లోని అసంతృప్తవాదులు, అవకాశం దక్కని వారిని ఆకర్షించేందుకు నేతలు ప్ర యత్నిస్తున్నారు. బీ ఫారాలు ముందే ఇస్తే టికెట్ దక్కని ఔత్సాహికులు ఇతర పార్టీల్లోకి వెళతారనే అనుమానం నేతలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో నామినేషన్ల దాఖలుకు చివరి తేదీన మాత్రమే బీ ఫారాలు ఇస్తామని చెప్తున్నారు. దీంతో తమకు టికెట్ దక్కుతుందనే ధీమాతో ఆశావహులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. టికెట్ దక్కని ఔత్సాహికులను బరి నుంచి తప్పుకునేలా చూడటం పార్టీలకు, నేతలకు కత్తిమీద సాములా కనిపిస్తోంది.
పార్టీలను వీడని అయోమయం
మున్సిపల్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో అన్ని పార్టీల్లోనూ గందరగోళం కనిపిస్తోంది. కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించాల్సిన కీలక నేతలు తమ భవితవ్యమేంటో తెలియక అయోమయంలో పడ్డారు. ఎంపీ, ఎమ్మె ల్యే టికెట్లు ఆశిస్తున్న నేతలకు ఆయా పార్టీల అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళం రెట్టింపవుతోంది. ఎవరికి వారుగా అనుచరులకు టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయ సాధన కుదరడం లేదు. చివరి నిముషంలో పార్టీలు మారుతున్న నేతలతో కూడా పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి రావడం లేదు.
వార్డుల్లో విస్తృత పరిచయాలు వున్న ఔత్సాహికులు పార్టీలు, టికెట్లతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్లుగా బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలు కఠినతరం చేయడంతో గతంలో మాదిరిగా భారీ హంగామా లేకుండా ఔత్సాహికులు గుట్టు చప్పుడు కాకుండా నామినేషన్లు దాఖలు చేసి వెళ్తున్నారు. ఇప్పటి వరకు నామినేషన్లు వేళ్ల మీద లెక్క పెట్టే స్థాయిలోనే దాఖలవుతున్నాయి. మరో మూడు రోజుల వ్యవధి వుండటంతో చివరి నిముషంలో కుప్పలు తెప్పలుగా నామినేషన్లు స్వీకరించాల్సి వుంటుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏం చేయాలబ్బా..!
Published Wed, Mar 12 2014 3:32 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement