దామరగిద్దలో నామినేషన్లను పరిశీలిస్తున్న అధికారులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామపంచాయతీ ఎన్నికలు తొలి విడతలో భాగంగా జిల్లాలోని 10 మండలాలు, 249 పంచాయతీల్లో జరగనున్నాయి. ఈ మేరకు బుధవారంతో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగియగా.. గురువారం అధికారులు స్క్రూటినీ నిర్వహించారు. అయితే, ఈ ప్రక్రియ రాత్రి పలు మండలాల్లో పొద్దు పోయే వరకు సాగడంతో ఎందరి నామినేషన్లను తిరస్కరించారనే అంశం శుక్రవారం ఉదయం తేలే అవకాశముంది. కాగా, చాలా పంచాయతీల్లో అటు సర్పంచ్ స్థానానికి, ఇటు వార్డు సభ్యుల స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఎన్నికలు పోటాపోటీగా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక 13వ తేదీ వరకు నామినేషన్ల విత్‌డ్రాకు అవకాశముండగా ఆ రోజు సాయంత్రానికి పోటీలో మిగిలిన వారి జాబితా వెల్లడించనున్నారు.
21న పోలింగ్
జిల్లాలోని 719 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనుండగా తొలి దశలో 10 మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు 249 పంచాయతీలు, 2,274 వార్డుల్లో ఈనెల 21న పోలింగ్ జరగనుంది. ఇక గురువారంతో తొలి దశలో పంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. సర్పంచ్ స్థానాలకు 1,454 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 5,103 నామినేషన్లు.. అన్నీ కలిపి 6,557 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు వెల్లడించారు. అయితే, స్క్రూటినీ ముగిశాక ఏమైనా తిరస్కరణకు గురయ్యాయా.. నామినేషన్ వేసిన వారిలో ఎవరైనా విత్‌డ్రా చేసుకుంటారా.. చివరకు పోటీలో ఎందరు మిగులుతారన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
నామినేషన్లు నిల్
కోయిల్‌కొండ మండలంలోని ఆచార్యపూర్ గ్రామపంచాయతీలో విచిత్ర పరిస్థితి చోటు చేసుకుంది. ఈ జీపీలోని 3వ వార్డుకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో ఆ స్థానానికి మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించనున్నారు. ఈ మేరకు ఆ వార్డు ఎన్నిక పూర్తయ్యే వరకు ఆచార్యపూర్ పంచాయతీకి ఉపసర్పంచ్‌ను ఎన్నుకునే వీలు ఉండదు.
15 పంచాయతీల్లో ఒక్కొక్కటే...
తొలి దశలో 249 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా 15 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఒక్కొక్కటే నామినేషన్ దాఖలైంది. అలాగే, ఆయా పంచాయతీల్లో వార్డు సభ్యుల స్థానాలకు కూడా ఒక్కటి చొప్పునే నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆయా పంచాయతీల కార్యవర్గాలను ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించనున్నారు. ఈ జాబితాలో నర్వ మండలంలోని లక్కర్‌దొడ్డి, ఎల్లంపల్లి, కొత్తపల్లి, సీపూర్, ధన్వాడ మండలంలోని బుడ్డమర్రి తండా, మరికల్ మండలంలోని కన్మనూర్, దామరగిద్ద మండలంలోని కంసాన్‌పల్లి, సుద్దబండ తండా, కోయిల్‌కొండ మండలంలోని కాన్గుబండ తండా, పల్గు తండా, చిన్నలింగల్‌చేడు, అయ్యవారిపల్లి, నల్లవల్లి, మోతీపూర్‌తో పాటు నారాయణపేట మండలంలోని వందర్‌గుడ్డ తండాలు ఉన్నాయి. వీటన్నింట్లో కూడా ఎక్కువ శాతం టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులే ఉన్నారు.ఇక నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు ఉన్నందున ఆలోగా మరికొన్ని పంచాయతీల కార్యవర్గాలు కూడా ఏకగ్రీవమయ్యే అవకాశముందని తెలుస్తోంది.
ఇక ప్రచారమే...
నామినేషన్ల స్వీకరణ గడువు ముగియడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. ఈనెల 19వ తేదీ సాయంత్రం వరకు ప్రచారం చేసుకునే వెసలుబాటు ఉంది. అంటే ఇంకా తొమ్మిది రోజులే గడువు ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ఓటర్లను కలుసుకునే పనిలో పడ్డారు. కాగా, గ్రామపంచాయతీ తొలి దశ ఎన్నికల్లో భాగంగా ఈనెల 21వ తేదీన ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట పోలింగ్ జరగనుంది. ఆ వెంటనే ఓట్లు లెక్కించి సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడిస్తారు. అలాగే, అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment