టీఆర్‌ఎస్ చెంప చెళ్లుమనే తీర్పు వస్తుంది
మెదక్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం: పొన్నాల
హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చెంప చెళ్లుమనిపించే తీర్పు రాబోతుందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యా ఖ్యానించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని, ఈ విషయం తెలిసే టీఆర్‌ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో రూ.5 లక్షల కోట్లకుపైగా విలువైన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్.. మూడు నెలల్లో ఒక్కటి కూడా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. రుణమాఫీని ఎగ్గొట్టడానికి వీలైనన్ని దారులు వెతుకుతున్నారని దుయ్యబట్టారు. రుణమాఫీ అందక, కరెంటు లేక, కరువుతో అల్లాడుతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్‌కు మాత్రం పట్టడంలేదని ధ్వజమెత్తారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడానికి, విదేశీ ప్రతినిధుల తో మాట్లాడటానికి గంటల తరబడి కేటాయిస్తున్న సమయాన్ని ప్రజా సమస్యలపై మాత్రం వెచ్చించకపోవడం బాధాకరమన్నారు.
వాస్తుదోషాలు, కార్ల రంగులు, గులాబీ పూల పైనున్న శ్రద్ధ.. రైతుల జాతకాన్ని మార్చేందుకు లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఎన్నికలకు ముందు కేసీఆర్‌పైనున్న భ్రమలన్నీ తొలగిపోయాయని, టీఆర్‌ఎస్ పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. సొంత పార్టీలో ముసలం ప్రారంభమైనందునే కేసీఆర్ ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారని అనుమా నం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలందరూ కలిసినా ప్రభుత్వాన్ని పడగొట్టలేరని తెలిసి కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం వెనుక ఆంతర్యమేమిటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.