కేసీఆర్‌వన్నీ అబద్ధాలే!
సీఎం అసమర్థత వల్లే రైతులకు కష్టాలు
‘రైతు భరోసా యాత్ర’లో ధ్వజమెత్తిన కాంగ్రెస్
నిజామాబాద్ జిల్లాలో టీపీసీసీ, సీఎల్పీ నేతల పర్యటన
ఎన్నికల్లో ఇచ్చిన హామీలేమయ్యాయి?
సర్కారు తీరును అసెంబ్లీలో ఎండగడతాం
అన్నదాతలకు అండగా ఉంటామని భరోసా
నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే రాష్ట్ర ప్రజలకు ఆకాశంలో చుక్కలు, అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌కు పట్టం కడితే బంగారు తెలంగాణ వస్తుందని ఆశించిన ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ వమ్ము చేశారని విమర్శించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి ప్రాథమిక హామీలను కూడా అమలు చేయడం లేదన్నారు. ప్రజలు బంగారు తెలంగాణ కోరుకుంటే.. బాధల తెలంగాణను చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. టీపీసీసీ, సీఎల్‌పీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు గురువారం నిజామాబాద్ జిల్లాలో ‘రైతు భరోసా యాత్ర’ను చేపట్టారు. దోమకొండ, భిక్కనూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్‌పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో విపక్ష నేత డి.శ్రీనివాస్, రైతు విభాగం అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పర్యటించారు. బస్వాపూర్, పెద్దమల్లారెడ్డి, కాచాపూర్, సంగమేశ్వర్, సీతారాంపూర్ దారి పొడవునా పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అనంతరం రామేశ్వర్‌పల్లిలో మీడియాతో మాట్లాడారు.
ఎన్నాళ్లు మభ్యపెడతారు?
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కనబెట్టిన కేసీఆర్ అబద్ధాలు చెబుతూ ప్రజలను ఇంకా మభ్య పెట్టాలని చూస్తున్నారని పొన్నాల అన్నారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల కరెంట్ ఇస్తామని చెప్పి ఏడు గంటల సరఫరా కూడా లేకుండా చేశారన్నారు. రెండు మూడు గంటలు కూడా కరెంట్ రాక నిజామాబాద్ జిల్లాలో వరి, మొక్కజొన్న, సోయా పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటలు నమ్మి ఓటేసిన 4 కోట్ల మంది ప్రజల కలలను వమ్ము చేస్తున్నారని మండిపడ్డారు. కరెంట్ కోతలు, అప్పుల బాధతో తెలంగాణలో ఇప్పటికే 220 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. కరెంట్, రుణమాఫీ విషయంలో ‘దాహమేస్తుంది అంటే.. బావి తవ్వుతా’ అన్నట్లుగా కేసీఆర్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ పార్టీని తిట్టి పబ్బం గడువుకోవాలని చూస్తే అది చెల్లదు. కేసీఆర్ ఖబడ్దార్. రైతుల సమస్యలు విస్మరించిన నీకు ఇక నూకలు చెల్లినట్లే. ఇప్పటికైనా 54 శాతం విద్యుత్ వాటా కోసం కొట్లాడు. విద్యుత్ మంత్రి, సీఎండీ లేని నీ పాలనలో రైతులను ఏం చేయదలచుకున్నావ్’ అంటూ పొన్నాల ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతులకు భరోసా ఇచ్చేందుకే ఈ యాత్రను మొదలుపెట్టామన్నారు. ఇది రాజకీయ యాత్ర కాదని.. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలని హితవు పలికారు.
రైతుల బాధలు వర్ణణాతీతం
టీఆర్‌ఎస్ పాలనలో రైతుల బాధలు వర్ణనాతీతమని జానారెడ్డి అన్నారు. హామీలతో ప్రజలను రెచ్చగొట్టి అధికారం చేపట్టిన కేసీఆర్ వాటి అమలును విస్మరించి ప్రజల ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ వైఖరితోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆత్మహత్యలు పునరావృతమవుతున్నాయని అన్నారు. నాలుగు నెలల కిందటే విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉండగా.. పంటలు ఎండిపోయాక కరెంట్ కొనుగోలుకు టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ప్రజల పక్షాన ఉంటుందని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అసెం బ్లీలో ఎండగడతామని జానారెడ్డి స్పష్టం చేశారు.
ఉసురు పోసుకుంటున్నారు
టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని, రైతుల కడుపుమంట, కన్నీరు ఏ ప్రభుత్వానికి మంచిదికాదని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.శ్రీనివాస్, షబ్బీర్ అలీ, పి.సుదర్శన్‌రెడ్డి తదితరులు వ్యాఖ్యానించారు. పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 20 ఏళ్లలో ఇంత దుస్థితిని ఎన్నడూ చూడలేదని, జనరేటర్ల సాయంతో పంటలు పండించుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సర్కారు హామీ మేరకు సాగుకు ఏడు గంటల కరెంట్ ఇవ్వాలని, నిజామాబాద్‌ను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.