'ఇద్దరు ఎంపీలతో తెలంగాణ వచ్చిందటే నమ్మడం లేదు'
హైదరాబాద్: ఎన్నికల్లో పొత్తుల కోసం కాంగ్రెస్ ఆరాట పడటం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని పొన్నాల అన్నారు. ఇద్దరు ఎంపీలున్న టీఆర్‌ఎస్‌తో తెలంగాణ వచ్చిందంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. పొత్తులపై ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం అనే పదం సరికాదని, బంగారు తెలంగాణ నిర్మాణం కాంగ్రెస్ తోనే సాధ్యమని పొన్నాల విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో రాజకీయంగా లబ్ది పొందడానికే దళితుడికి సీఎం, బీసీలకు సీఎం అంటూ టీఆర్‌ఎస్, టీడీపీ ఎన్నికల హామీ ఇస్తున్నాయని పొన్నాల ఎద్దేవా చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత నగరానికి వచ్చిన పొన్నాలకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.