కాంగ్రెస్‌ 420 హామీలను అమ‌లు చేసేదాకా విడిచి పెట్టం: కేటీఆర్‌ | KTR Slams Congress Government At Medak Parliamentary Meeting | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ 420 హామీలను అమ‌లు చేసేదాకా విడిచి పెట్టం: కేటీఆర్‌

Published Fri, Jan 19 2024 6:27 PM | Last Updated on Fri, Jan 19 2024 7:31 PM

KTR Slams Congress Government At Medak Parliamentary Meeting - Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని,  420 హామీలని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నోటికి ఎంత వస్తే అంత అనుకుంటూ హామీలు ఇచ్చారని, అందుకే 420 హామీలను అమ‌లు చేసేదాకా విడిచి పెట్టామని తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మెద‌క్ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి స‌మావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావు పాల్గొని బీఆర్‌ఎస్‌ నేతలతో చర్చించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రధాని, అదానీ ఒక్కటని విమర్శలు చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నేడు ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ నిన్ననే అదానీని తిడితే, రేవంత్ రెడ్డి అదే సమయంలో దావోస్‌లో ఒప్పందం చేసుకున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. . కేసీఆర్ ఉన్నంత కాలం అదానీ ఇక్కడ అడుగు పెట్టలేదు. కానీ కాంగ్రెస్ రాగానే ఎలా అడుగు పెడుతున్నాడ‌ని కేటీఆర్ నిల‌దీశారు. నోటికి వచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల అసలు రంగు బయట పడుతుందన్నారు.

‘గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుళ్ళ అయ్యిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలం అయ్యిందని అబద్ధాలు మాట్లాడించారు. అందుకే స్వేద పత్రం విడుదల చేశాం. తెలంగాణ సమగ్ర అభివృద్ధిని పొందుపరిచాం. గణాంకాలు, ఆధారాలతో సహా వివరించాం. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న‌ రుణమాఫీ చేస్తా.. రూ. 2 లక్షల రుణం తెచ్చుకోండి అని పీసీసీ అధ్య‌క్షుడి హోదాలో రేవంత్ మాట్లాడారు.

తుమ్మల నాగేశ్వర్‌ రావు రుణాలు వసూలు చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. లేకుంటే కేసులు పెట్టండి అని అంటున్నాడు. పత్రికల్లో కూడా వచ్చింది. ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే, భట్టి విక్ర‌మార్క‌ భృతి ఇస్తామని చెప్పలేదని హరీష్ రావు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా అబద్దం చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని హామీ ఇచ్చారు కానీ అది సాధ్యం కాదని మొన్న స్పష్టమైంది.

కేసీఆర్‌, హరీశ్ రావు నాయకత్వంలో కార్యకర్తలంతా క్రియాశీలకంగా పని చేయడంతో గత ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించాం. ఈ సారి కూడా మెదక్‌లో గులాబీ జెండా ఎగరబోతున్నది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గత పదేళ్ళలో తెలంగాణ తరుపున గళం విప్పింది మన బీఆర్ఎస్ ఎంపీలు అనే విషయం మరచి పోవద్దు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మన బలం, మన గళం, మన గులాబీ జెండా పార్లమెంట్‌లో ఉండాలి. లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని. ఇదే విషయం ప్రజలకు చెప్పాలి. నిరాశ వీడాలి. బయటికి రావాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు హరీష్ రావు, సునీతా లక్ష్మా రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనాచారి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement