మెదక్ నుంచి రాహుల్ పోటీచేయాలి
Published Tue, Sep 17 2013 12:41 AM | Last Updated on Tue, Oct 9 2018 5:54 PM
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మెదక్ ఎంపీగా పోటీ చేయాలని తాము కోరుకుంటున్నామని, జిల్లా నుంచి పోటీ చేయాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ తరఫున ఆయనను కోరతామని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా నుంచి ఎంపీగా రాహుల్ పోటీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ ఆయన జిల్లా నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ నాయకులమంతా సంతోషిస్తామన్నారు. రాహుల్‌గాంధీ పోటీ విషయమై జిల్లా నాయకత్వంతో చర్చిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పక్రియను వేగవంతం చేయాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరేందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు, నాయకులు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్లు చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా జెండాల ఎగురవేత
కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు భూపాల్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాలు, పట్టణాల్లో బ్లాక్, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జాతీయ, పార్టీ జెండాలను ఎగురవేయాలని కోరారు. జెండా ఎగురవేసిన అనంతరం సభ నిర్వహించి, తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానాలు చేసి జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి పంపించాలని కోరారు. ఈనెల 18, 19 తేదీల్లో అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ సభలు నిర్వహించటంతోపాటు పార్టీ జెండాలు ఎగురవేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 20న నిర్వహించనున్న కాంగ్రెస్ సభకు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డితోపాటు పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, హాజరుకానున్నట్లు తెలిపారు. సభలో తెలంగాణ ప్రకటించినందుకు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేస్తామన్నారు. సభకు హాజరు కావాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డకి ఆహ్వానం పలికామన్నారు.
Advertisement