ఉప పోరుకు సై
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వ్యూహ రచనలో ప్రత్యర్థి కంటే ఎప్పుడూ మూడు అడుగులు ముందే ఉంటారు గులాబీ దళపతి. ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మెదక్ పార్లమెంటు నియెజకవర్గంలో తన బలగాల మోహరింపుపై కసరత్తు మొదలు పెట్టారు. ఉప పోరుకు సిద్ధం కావాలని, 4 లక్షల ఓట్లకు పైగా మెజార్టీ లక్ష్యంగా కృషి చేయాలని ఆయన జిల్లా నాయకత్వాన్ని ఆదేశించినట్టు సమాచారం.
ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా మంత్రి, పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్‌రావు మీదనే పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు కేసీఆర్ సోమవారం మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి తదితర నాయకులతో సమావేశమయ్యారు. గెలుపు నల్లేరు మీద నడకేనని, ఉహించని విధంగా అధిక మెజార్టీ సాధించాలని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కేసీఆర్ 2 లక్షలకు పై చిలుకు ఓట్లతో గెలుపొందారు.
ఈసారి అభ్యర్థి ఎవరైనా సరే నాలుగు లక్షల మెజార్టీతో గెలిపించాలని జిల్లా పార్టీ నాయకత్వాన్ని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలపై ఆయన చర్చించినట్లు సమాచారం. అభ్యర్థిని ఎవరిని నిలబెడితే బాగుంటుందనే అంశంపై ఆయన నాయకులను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. బీసీ,లేక ముస్లిం మైనారిటీ వర్గాల నుంచి అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుందనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే ఎన్నికల సమయంలో ఎక్కడెక్కడా సభలు నిర్వహించాలి? అనే అంశంపై కూడా కూలంకశంగా చర్చినట్లు సమాచారం. ఏది ఏమైనా ఉప ఎన్నికలో అధిక మెజారిటీ సాధించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలని కేసీఆర్ సూచించినట్టు తెలిసింది.