
ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ దే అత్యధిక మెజార్టీ
హైదరాబాద్:ప్రస్తుతం విభజనకు సిద్ధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అత్యధిక ఓట్లు దక్కించుకుని రికార్డు సృష్టించారు. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో తీసుకువెళ్లి.. రాష్ట్రాన్ని దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు పట్టంకట్టారు. మెదక్ లోక్ సభ నుంచి పోటీకి దిగిన ఆయన 3,97,029 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ నేత శ్రవణ్ కుమార్ పై భారీ విజయం సాధించారు. తెలంగాణ సెంటిమెంట్ ను ఆద్యంతం తనవైపుకు తిప్పుకున్న కేసీఆర్.. గతంలో ఇదే స్థానం నుంచే పోటీ చేసి గెలిపొందిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెజార్టీని అధిగమించారు.
ఈ నియోజకవర్గంలో అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇందిరా గాంధీ సాధించిన 2,19,214 ఓట్ల మెజార్టీనే అత్యధికంగా ఉంది. మెదక్ పార్లమెంట్ నియోజక పరిధిలో ఉన్న గజ్వేల్ అసెంబ్లీ నుంచి కూడా పోటీకి దిగిన కేసీఆర్ 19, 218 ఓట్లతో గెలుపొందారు. కాగా, మహబూబ్ నగర్ లోక్ సభ స్థానంలో మాత్రం అత్యల్ప ఓట్ల మెజార్టీతో మాజీ కాంగ్రెస్ మంత్రి జైపాల్ రెడ్డి ఓటమి పాలైయ్యారు. ఇక్కడ నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి జితేందర్ రెడ్డి 2,590 మెజార్టీతో గెలుపొంది తక్కువ ఓట్లతో గెలిచిన అభ్యర్థిగా నిలిచారు.