వారు అభివృద్ధి నిరోధకులు | they development resisters : Harish Rao | Sakshi
Sakshi News home page

వారు అభివృద్ధి నిరోధకులు

Published Sat, Sep 6 2014 11:23 PM | Last Updated on Tue, Oct 9 2018 5:54 PM

they development resisters : Harish Rao

 సిద్దిపేట జోన్: మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, సునీతాలకా్ష్మరెడ్డిలు అభివృద్ధి నిరోధకులని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా తనవద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు. శనివారం ఆయన టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో  మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి పాదయాత్ర నిర్వహించారు.

 ఈ సందర్భంగా స్థానిక నాసర్‌పురాలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. సిద్దిపేట మున్సిపాలిటీలో విలీనం చేసిన ఆరు గ్రామాల అభివృద్ధి కోసం తాను ఎమ్మెల్యే హోదాలో రూ. 150 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, అప్పుడు ప్రభుత్వ విప్‌గా ఉన్న జగ్గారెడ్డి అడ్డుకున్నారన్నారు. జగ్గారెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాసిన లేఖ ఇదే నంటూ బహిరంగ సభలో ప్రజలకు చూపించారు. ఇక మంత్రి హోదాలో సునీతాలక్ష్మారెడ్డి సిద్దిపేటలో పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అప్పటి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.

 సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్న వారిద్దరూ నేడు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలను ఓట్లు అభ్యర్థించడం ఎంతవరకు సమంజసమన్నారు.  ఈ ఉప ఎన్నికల్లో వారిద్దరి డిపాజిట్లు గల్లంతు చేసి సిద్దిపేట దెబ్బ ఎలా ఉంటుందో చూపాలన్నారు. అనంతరం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, సిద్దిపేట ప్రజలు లేనిది కేసీఆర్ లేడని, కేసీఆర్ లేనిది తెలంగాణ ఉద్యమం లేదన్నారు.

 మంచి ముఖ్యమంత్రిని రాష్ట్రానికి అందించిన ఘనత సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు దక్కుతుందన్నారు. ఎంత చేసిన సిద్దిపేట రుణం తాము తీర్చుకోలేమన్నారు. సమావేశంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, టీఆర్‌ఎస్ నాయకులు రాజనర్సు, మచ్చవేణుగోపాల్‌రెడ్డి, చిన్న, నయ్యర్, బర్ల మల్లికార్జున్, జంగిటి కనకరాజు, కూర బాల్‌రెడ్డి, కాముని నగేష్, బోనాల నర్సింలు, కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

 బీజేపీకి ఓటు వేస్తే బెజవాడ బాబుకు వేసినట్లే
 సిద్దిపేట రూరల్:  మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే తెలంగాణను అడుగడుగునా అడ్డుకున్న చంద్రబాబుకు ఓటు వేసినట్లేనని, ఇక కాంగ్రెస్ ఓటు వేస్తే అది మురిగిపోతుందని మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట మండలం మిట్టపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ సిద్దరబోయిన రాజ్యలక్ష్మి శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, వివిధ సంఘాలు ‘ఓటుకు నోటు కార్యక్రమం’ నిర్వహించారు. అనంతరం హరీష్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కలిసి మాట్లాడుతూ, బీజేపీకి అభ్యర్థులు లేక సమైక్యవాదిని నిలబెట్టారన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటికీ బీజేపీలో ఆంధ్రాపెత్తనం కొనసాగుతోందని, చంద్రబాబు చెప్పిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని, ఈ విషయం కిషన్‌రెడ్డికి తెల్వదా అని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉండి ఏం అభివృద్ధి చేశారో ఇప్పుడు ఏం చేయడానికి ఓటు వేయమని అడుగుతున్నారో చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఓటమి అందరికి తెలుసని అందుకే ఇక్కడి ప్రచారానికి జాతీయ నాయకులు రావడం లేదన్నారు.

 టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీ నెరవేరుస్తుందని, అలాగే రుణమాఫీ ఈ నెలాఖరులోగా పూర్తవుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు కిషన్‌రెడ్డి, గ్రామ ఎంపీటీసీ భూలక్ష్మి శ్రీనివాస్, నాయకులు నారేంద్రనాథ్, స్వామిచరణ్, బాలకిషన్‌రావు, శ్రీనివాస్‌రావు, ప్రవీణ్‌రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement