మెదక్ జిల్లాలో పోటాపోటీ
పార్లమెంట్ స్థానంలో కేసీఆర్ ముందంజ.. అసెంబ్లీ స్థానాల్లో పలుచోట్ల కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య ఉత్కంఠ
ప్రతిష్టాత్మకమైన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో చతుర్ముఖపోటీ నెలకొంది. టీఆర్‌ఎస్ నుంచి ఆ పార్టీ అధినేత చంద్రశేఖర్‌రావు స్వయంగా రంగంలోకి దిగిన విషయం విదితమే. కాంగ్రెస్ నుంచి చివరి నిమిషంలో శ్రావణ్‌కుమార్‌రెడ్డి రంగంలో దిగగా.. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి వదిలిపెట్టింది. బీజేపీ నుంచి చాగన్ల నరేంద్రనాథ్ బరిలో ఉన్నారు. ైవె ఎస్సార్‌సీపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ రంగంలో ఉన్నారు. గతంలో కరీంనగర్, మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానాల నుంచి గెలుపొందిన చంద్రశేఖరరావు ఈసారి సొంత జిల్లా నుంచి అభ్యర్థిగా రంగంలో దిగడంతో.. ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కొత్త ఊపు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఇక్కడ నుంచే ఉద్యమం ప్రారంభించిన చంద్రశేఖరరావుకు ఎంపీగా విజయం సునాయాసమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రస్తుత ఎమ్మెల్యేల్లో ఆ పార్టీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. అదీ సిద్దిపేట ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. మిగిలిన ఆరింటిలో ఒకటి తెలుగుదేశం, ఐదింటిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 14.76 లక్షల మంది ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లలో.. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరువు ఉన్నాయి. ఈసారి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తున్న చంద్రశేఖరరావు ఎలాగైనా తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. కేసీఆర్ ప్రత్యర్థులకు రాజకీయ అనుభవం పెద్దగా లేకపోవడం గమనార్హం.
కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న శ్రావణ్‌కుమార్‌రెడ్డి తొలిసారిగా ఎన్నికల బరిలో నిల్చున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న చాగన్ల నరేంద్రనాథ్ గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. కేసీఆర్ స్వయంగా ఈ స్థానం పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఎంత మెజారిటీతో గెలుస్తారన్న విషయంపైనే అందరి దృష్టి ఉంది. కేసీఆర్ సాధించే మెజారిటీ సిద్దిపేటలో వచ్చే మెజారిటీపై ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయం ఉంది. కేసీఆర్ అసెంబ్లీకి పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో తీవ్రపోటీ నెలకొన్న నేపథ్యంలో అక్కడ నుంచి భారీ మెజారిటీ ఆశించలేకపోతున్నారు. అసెంబ్లీ కంటే పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఇతర నియోజకవర్గాల నుంచి క్రాస్‌ఓటింగ్ భారీగా జరిగే అవకాశం ఉంది. మెదక్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నరేంద్రనాథ్ నిల్చున్నా.. తెలుగుదేశం వర్గాలు సంపూర్ణంగా సహకరించడం లేదు. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతాప్‌రెడ్డి ఒక ఓటు తనకు, రెండో ఓటు కేసీఆర్‌కు వేయాలని అంతర్గతంగా చెబుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసేవారు ఎంపీ స్థానానికి వచ్చేసరికి కేసీఆర్‌వైపు మొగ్గుచూపుతున్నారు. చతుర్ముఖపోటీలో కేసీఆర్ విజయం సాధించడం తేలిక అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పరిశీలిస్తే..
గజ్వేల్: ఈ నియోజకవర్గంలో కేసీఆర్ స్వయంగా రంగంలో ఉన్నారు. టీడీపీ నుంచి వంటేరు ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి నర్సారెడ్డి, వైఎస్సార్‌సీపీ నుంచి పురుషోత్తమరెడ్డి బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. స్వల్ప మెజారిటీతో ఎవరినైనా విజయం వరించనుంది.
సిద్దిపేట: సిద్ధిపేట నియోజకవర్గం మొదటి నుంచి టీఆర్‌ఎస్‌కు పట్టుగొమ్మగా నిలుస్తోంది. ఈసారి కూడా హరీశ్‌రావు విజయం సులభమే అన్న అభిప్రాయం వ్యకమవుతోంది. టీఆర్‌ఎస్ నుంచి హరీశ్‌రావు, కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్‌గౌడ్, పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీ నుంచి విద్యాసాగర్ పోటీ చేస్తుండగా, వైఎస్సార్‌సీపీ నుంచి జగదీశ్వర్ రంగంలో ఉన్నారు. ఇక్కడ పోటీ కంటే ఏకపక్షంగా ఎన్నిక జరుగుతుందన్న అభిప్రాయం ఉంది.
దుబ్బాక: ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ నుంచి ముత్యంరెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి రామలింగారెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, వైఎస్సార్‌సీపీ నుంచి శ్రావణ్‌కుమార్ గుప్తా పోటీ పడుతున్నారు. అయితే పోటీ మాత్రం టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే నెలకొంది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడంతో ముత్యంరెడ్డికి ప్రజల్లో మంచి పేరుంది. అయన అభివృద్ధి కార్యక్రమాలు బాగానే ఉన్నా.. నోటి దురుసుతనం కొంత ఇబ్బంది కలిగిస్తుందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుదగ్గ స్థాయిలో లేకపోవడం గమనార్హం తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు అటు నుంచి బీజేపీలో చేరిన రఘునందన్‌రావు ఇక్కడ పోటీ చేయడం వల్ల టీఆర్‌ఎస్ ఓట్లను చీలుస్తారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మెదక్: ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో చతుర్ముఖ పోటీ ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం టీ ఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య నెలకొంది. టీఆర్ ఎస్ ఎంపీగా ఉన్న విజయశాంతి పార్టీ మారి కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగితే.. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పద్మా దేవేందర్‌రెడ్డి ఈసారి టీఆర్‌ఎస్ తరుపున బరిలో ఉన్నారు. తెలుగుదేశం నుంచి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బట్టి జగపతి, వైఎస్సార్ సీపీ తరపున క్రీస్తుదాసు పోటీ చేస్తున్నారు.
నర్సాపూర్: నర్సాపూర్ సెగ్మెంట్‌లో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మరోసారి బరిలోకి దిగారు. టీఆర్‌ఎస్ నుంచి మదన్‌రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి చాగన్ల నరేంద్రనాథ్ కుమారుడు బల్వీందర్‌నాథ్ బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి దందె బస్వానందం పోటీ పడుతున్నారు. ఇక్కడ కూడా పోటీ టీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉండనుంది.
పటాన్‌చెరు: పటాన్‌చెరులో చతుర్ముఖపోటీ నెలకొంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి నందీశ్వర్‌గౌడ్, టీఆర్‌ఎస్ నుంచి మహిపాల్‌రెడ్డి, టీడీపీ నుంచి సపానదేవ్, వైఎస్సార్‌సీపీ నుంచి శ్రీనివాస్‌గౌడ్ బరిలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక్కడ ఎవరు విజయం సాధించినా స్వల్ప ఆధిక్యతతోనే అన్న అభిప్రాయం ఉంది.
సంగారెడ్డి: టీఆర్‌ఎస్ పార్టీని గట్టిగా వ్యతిరేకించే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) కాంగ్రెస్ నుంచి రంగంలో ఉన్నారు. టీఆర్ ఎస్ నుంచి చింతా ప్రభాకర్, బీజేపీ నుంచి సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా శ్రీధర్‌రెడ్డి రంగలో ఉన్నారు. పోటీ ప్రధానంగా టీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది.