
చప్పగా... సాఫీగా..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నిక చప్పగా.. ప్రశాంతంగా ముగిసింది. రైతులు, మహిళలు ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో, గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపించలేదు. ఓటింగ్ శాతం తగ్గినా కారు జోరు మాత్రం తగ్గలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రుణ మాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ముభావం ప్రకటించినా.. వ్యతిరేక ఓటు మాత్రం వేయలేదని వారు విశ్లేషిస్తున్నారు. ఉప ఎన్నికలో 65.74 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ‘అయితే ఇది ఉజ్జాయింపు మాత్రమేనని, ఖచ్చితమైన లెక్కలు తీసుకుంటే పోలింగ్ 60 శాతానికి మించి ఉండకపోవచ్చ’ని ఎన్నికల అధికారి ఒకరు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు.
గత సాధారణ ఎన్నికల్లో పోలింగ్ రోజున 82 శాతం పోలింగ్ నమోదైందని ప్రకటించగా, ఈ తర్వాత లెక్కల్లో 77.35 శాతం అని తేలిందని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని వారు వివరించారు. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనా దాదాపు 9 గంటల వరకు ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు బోసిపోయి కనిపించాయి. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. మొదటి రెండు గంటల్లో కేవలం 7.5 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అత్యధికంగా నర్సాపూర్ నియోజకవర్గంలో 77 శాతం, అత్యల్పంగా పటాన్‌చెరు నియోజకవర్గంలో 52 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ బొజ్జా ప్రకటించారు.
రామాయంపేట మండలం శివ్వాయపల్లిలో 96 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ఇదిలా ఉండగా అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించినప్పటికీ అది పెద్ద సమస్య కాలేదు. 30 నిమిషాల వ్యవధిలో అధికారులు తిరిగి కొత్త మిషన్లను తెచ్చిపెట్టారు. కాగా, ఎన్నికలను టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రుణమాఫీపై ప్రభుత్వ స్పష్టత ఇవ్వకపోవడం, అన్నదాత ఆత్మహత్యల పరంపర నేపథ్యంలో మెతుకుసీమ రైతన్న కాస్త ముభావాన్ని ప్రదర్శించారు. సర్కారు మీద అసంత ృప్తిని వ్యక్తం చేస్తూ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అధిక శాతం మహిళలు ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదు.
సమగ్ర సర్వే ప్రభావం..
గత నెల 19న నిర్వహించిన సమగ్ర సర్వే ప్రత్యక్షంగా, పరోక్షంగా పోలింగ్ మీద ప్రభావం చూపించింది. ఈ సర్వే కోసం వలస జీవులు, ఉద్యోగులు, యువకులు పిల్లా పాపలతో కలిసి ఊళ్లకు వచ్చారు. అందరూ ఒకేసారి కలిసిరావడం, చాలా ఏళ్ల తర్వాత బంధుమిత్రులంతా ఒకేచోట కలవడంతో రెండు రోజుల పాటు పల్లెల్లోనే గడిపారు. దీంతో ప్రతి కుటుంబం సగటున రవాణా చార్జీలు, ఇతర భత్యాలతో కలసి రూ. 4 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చయ్యాయి. 20 రోజులు కూడా గడవకుండానే మళ్లీ ఎన్నికలు రావడంతో ప్రజలు ఓటేసేందుకు స్వగ్రామలకు రావడానికి ఇష్టపడలేదు. కాగా సర్వే ప్రభావం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని కొంతమంది ఓటర్లు భయపడుతున్న నేపథ్యంలో స్వల్పంగా బీజేపీ లాభపడ్డట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.