ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రం, ఛక్వాల్ జిల్లాలో అదో గ్రామం. పేరు ధుర్నాల్. ఒకప్పుడు పేరుపోసిన బందిపోటు మొహమ్మద్ ఖాన్ భయం గుప్పిట్లో బ్రతికిన గ్రామం. ఇప్పుడా గ్రామం ఎంతో అభివద్ధి చెందింది. బాలుర కోసం రెండు ప్రభుత్వ హైస్కూల్, బాలికల కోసం ఓ ప్రత్యేక ప్రభుత్వ హైస్కూల్ ఉంది. బాల, బాలికల కోసం రెండు ప్రత్యేక డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రంలోనే మహిళల అక్షరాస్యత ఈ గ్రామంలో ఎక్కువ. ఈ గ్రామానికో ఓ ప్రత్యేకత ఉంది.
1960 దశకం నుంచి ఈ గ్రామంలోని మహిళలు ఏ ఎన్నికల్లోనూ ఓటు వేయడం లేదు. వారు ఓటు వేయరాదంటూ వారి మగాళ్లు పెట్టిన షరతుకు వారు ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. ఓటర్లుగా వారి పేర్లు నమోదై ఉంటాయి. వారు ఓటు వేయరు. ఓటు వేయాల్సిందిగా పోటీ చేసే అభ్యర్థులు అడగరు. 1962లో ఎన్నికల సందర్బంగా ఎన్నికలకు ముందు ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగి పలువురు చనిపోయారట. ఆ ఘర్షణలు ఆడవాళ్ల కారణంగానే జరగడం వల్ల నాటి నుంచి ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ అప్పటి పంచయతీ సర్పంచ్ మెహర ఖాన్ పిలుపునిచ్చారని, ఆ పిలుపునకు కట్టుబడి ఇంట్లోని ఆడవారిని ఎవరిని ఓటుకు అనుమతించమని గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారని గ్రామానికి చెందిన 63 ఏళ్ల జోహర్ ఖాన్ తెలిపారు.
ధుర్నాల్ గ్రామం జాతీయ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్‌ఏ–61, పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గం పీపీ–23 పరిధిలోకి వస్తోంది. ఈ ప్రాంతంలో జాతీయ అసెంబ్లీ, ప్రాంతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసే మహిళల శాతం కూడా చాలా తక్కువే. 2013లో ఎన్‌ఏ–61 నియోజక వర్గంకు జరిగిన ఎన్నికల్లో 4.42 శాతం మంది మహిళలు ఓటు వేయగా, పీపీ–23 ప్రాంతీయ అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఎన్నికల్లో 5 శాతం మంది ఓటు వేశారు. ఈ రెండు ఎన్నికల్లో ధుర్నాల్ గ్రామంలో ఒక్కరంటే ఒక్క మహిళ కూడా ఓటు వేయలేదు. 15000 మంది జనాభాగల ఈ గ్రామంలో 11000 మంది ఓటర్లు ఉండగా, ఐదువేల మంది
మహిళా ఓటర్లు ఉన్నారు.
మహిళా ఓటర్లలో ఎంతో మంది ఉన్నత విద్యావంతులు ఉన్నప్పటికీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇష్టపడడం లేదు. ‘నేను పోస్ట్ గ్రాడ్యువేట్‌ను. ఓటు వేయడం రాజ్యాంగపరంగా నాకు సంక్రమించిన ప్రాథమిక హక్కనే విషయం నాకు తెలుసు. నేను ఓటు వేయాలంటే ఇంట్లోని మగవారి అనుమతి తీసుకోవాలి కనుక ఓటు వేయడం లేదు’ పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ మహిళ తెలిపారు. ఎందుకు మీరు మహిళలను ఓటింగ్‌కు అనుమతించడం లేదని మగవాళ్లను ప్రశ్నించగా, అనుమతించమంటూ నాడు శపథం చేసినప్పుటు అల్లా ఉద్దేశించి ఆకాశం వైపు చేతులు చాచామని, అందుకని అల్లాకిచ్చిన మాట తప్పలేమని ఎక్కువ మంది సమాధానం ఇచ్చారు.
ఇదే కారణంగా ఒక్క ధుర్నాల్ గ్రామంలోనే కాకుండా సమీపంలో ఉన్న దౌలార్, భల్వా, మోగ్లా, ధోక్‌దాల్ గ్రామాల్లో కూడా మహిళలు ఓటు వేయలేదు. 2013లో ఈ గ్రామాల్లో 17 పోలీంగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఒక్క మహిళ కూడా ఓటు వేయలేదు. ఈసారి జరుగనున్న ఎన్నికల్లో మహిళల చేత ఓటు వేయించేందుకు కొందరు సామాజిక కార్యకర్తకర్తలు ఈ గ్రామాల్లో ఇల్లిల్లు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment