పాక్‌ ఎన్నికల బరిలో...ఆమె అంతంతే  | Pakistan Elections 2024: Women candidates all set to contest polls | Sakshi
Sakshi News home page

పాక్‌ ఎన్నికల బరిలో...ఆమె అంతంతే 

Published Wed, Feb 7 2024 1:30 AM | Last Updated on Wed, Feb 7 2024 1:30 AM

Pakistan Elections 2024: Women candidates all set to contest polls - Sakshi

పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమవుతోంది. గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్‌ జరగనుంది. పాక్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సైన్యం దన్నున్న పార్టీ యే గెలవడం ఆనవాయితీ. ఆ లెక్కన ఈసారి మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సారథ్యంలోని పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (ఎన్‌)దే విజయం ఖాయమంటున్నారు. మరో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సైన్యం ఆగ్రహానికి గురై జైలుపాలవడంతో ఆయన పార్టీ పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ కకావికలైపోయింది. బిలావల్‌ భుట్టో సారథ్యంలోని పీపీపీ కూడా పెద్దగా పోటీ ఇచ్చేలా కన్పించడం లేదు. ఎప్పట్లాగే ఈ ఎన్నికల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం అంతంతే ఉంది... – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

పాకిస్తాన్‌ ఎన్నికల బరిలో ఉన్న మొత్తం 17 వేల మంది పై చిలుకు అభ్యర్థుల్లో మహిళలు ఎందరో తెలుసా? కేవలం 839 మంది! అంటే 4.7 శాతం. సాంప్రదాయికంగా పాక్‌లో మహిళలకు రాజకీయాల్లో అంతగా ప్రోత్సాహం దక్కదు. దాంతో ఎన్నికల్లో కూడా వారి ప్రాతినిధ్యమూ అంతంతమాత్రంగానే ఉంటూ వస్తోంది. పరిస్థితిని మార్చేందుకు మహిళలకు కనీసం 5 శాతం టికెట్లివ్వడాన్ని ఎన్నికల సంఘం తప్పనిసరి చేసింది. అయినా వారికి ఆ మాత్రం టికెట్లిచ్చేందుకు కూడా ప్రధాన పార్టీ లకు మనసు రావడం లేదు.

ఈసారి మహిళలకు ఇమ్రాన్‌ సారథ్యంలోని పీటీఐ ఇచ్చిన 53 టికెట్లే అత్యధికం! అయితే వారిలోనూ జాతీయ అసెంబ్లీకి పోటీ పడుతున్నది కేవలం 28 మందే. మిగతా 25 మంది ప్రావిన్సుల స్థానాల్లో పోటీకి పరిమితమయ్యారు. ఇక మహిళలకు పీపీపీ 4.5 శాతం, పీఎంఎల్‌ (ఎన్‌) కేవలం 4.2 శాతం టికెట్లతో సరిపెట్టాయి. పీపీపీ నుంచి 35 మంది, పీఎంఎల్‌ నుంచి 28 మంది మహిళలే బరిలో ఉన్నారు. వారిలోనూ చాలామంది పోటీ ప్రావిన్సు స్థానాలకే పరిమితం! కాకపోతే పాక్‌ చరిత్రలోనే తొలిసారిగా ఓ హిందూ మహిళ బరిలోకి దిగుతుండటం ఈ ఎన్నికల ప్రత్యేకతగా నిలవనుంది. అలాగే ఓ యూట్యూబ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్, తాలిబన్ల చేతిలో భర్తను కోల్పోయిన మరో మహిళా నేత బరిలో ఉన్నారు....

సవీరా.. తొలి హిందూ అభ్యర్థి 
25 ఏళ్ల సవీరా ప్రకాశ్‌ పాకిస్తాన్‌లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు. ఖైబర్‌ ఫక్తూన్‌ఖ్వా ప్రావిన్సులో బునెర్‌ జిల్లాలోని పీకే–25 నియోజకవర్గం నుంచి పీపీపీ టికెట్‌పై బరిలో దిగిన ఆమె ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటీవలే వైద్యవిద్య పూర్తి చేసిన సవీరాది ఆసక్తికరమైన నేపథ్యం. ఆమె తండ్రి ఓం ప్రకాశ్‌ సిక్కు కాగా తల్లి క్రిస్టియన్‌. వారిద్దరి అంగీకారంతో సవీరా మాత్రం హిందూ మతావలంబిగా మారారు. తద్వారా పాక్‌ వంటి ముస్లిం మెజారిటీ దేశంలో మత సహనానికి, సామరస్యానికి ప్రతీకగా నిలిచారామె. భారత మూలాలున్న ఓం ప్రకాశ్‌ ఉచిత వైద్యంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా పేరు పొందారు.

ఎన్నడూ ఎన్నికల బరిలో దిగకపోయినా 30 ఏళ్లుగా పీపీపీ కార్యకర్తగా ఉంటూ వస్తున్నారు. చెడు చేయాలని ఏ మతమూ చెప్పదంటూ సవీరా చేస్తున్న ప్రచారానికి ముస్లింల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. మత, లింగ వివక్షను నిర్మూలించడమే తన లక్ష్యమని ఆమె అంటున్నారు. ‘‘పాక్‌లో ప్రజా జీవితంలో మహిళ పట్ల వివక్ష బాగా ఉంది. మా జిల్లానే తీసుకుంటే చదువుకున్న మహిళల సంఖ్య కేవలం 29 శాతం. దేశవ్యాప్తంగా కూడా మహిళల్లో అక్షరాస్యత 46 శాతమే. దీన్ని మార్చేందుకే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా’’ అని చెబుతున్నారు. మహిళా రిజర్వు స్థానం నుంచి కాకుండా జనరల్‌ సీటు నుంచి ఆమె బరిలో దిగడం మరో విశేషం. 

ఓటర్లను ‘ఇన్‌ఫ్లుయెన్స్‌’  చేస్తుందా...? 
లాహోర్‌లోని ఎన్‌ఏ–122 స్థానంలో పీఎంఎల్‌ (ఎన్‌) అభ్యర్థి ఖవాజా సాద్‌ రఫీక్, పీటీఐకి చెందిన లతీఫ్‌ ఖోసా హోరాహోరీ తలపడుతున్నారు. వారిద్దరినీ ఢీకొంటున్న ఓ యూట్యూబ్‌ సంచలనం ఇప్పుడు దేశమంతటి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆమే జెబా వకార్‌. వృత్తిరీత్యా గైనకాలజిస్టు అయిన ఆమె జమాత్‌ ఇ ఇస్లామీ అనే మతపరమైన పార్టీ సభ్యురాలు. ఆ పార్టీ తరఫునే బరిలో దిగారు. యూట్యూబ్‌లో ఆమెకు 17,500 మందికి పైగా ఫాలోయర్లున్నారు. ఖురాన్, హదీత్‌లపై రోజూ ప్రసంగాలు అప్‌లోడ్‌ చేస్తుంటారు. విద్యాధికులైన యువతులకు ఖురాన్‌ పాఠాలు చెప్పే సంస్థను కూడా భర్తతో కలిసి నడుపుతున్నారు. ‘‘నన్ను గెలిపిస్తే మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా చూస్తా. వారిపై వేధింపులకు తెర దించేలా కఠిన చట్టాల కోసం కృషి చేస్తా’’ అని చెబుతున్నారు.  

భర్త బాటన... 
ఇక పెషావర్‌ నుంచి బరిలో దిగుతున్న సమర్‌ హరూన్‌ బిలౌర్‌ది మరో గాథ. గత ఎన్నికల వేళ ఆమె భర్త హరూన్‌ను ప్రచారం సందర్భంగా పాక్‌ తాలిబన్లు కిరాతకంగా కాల్చి చంపారు. దాంతో ఆయన స్థానంలో సమర్‌ బరిలో దిగాల్సి వచ్చింది. అవామీ వర్కర్స్‌ పార్టీ తరఫున ఆ ఎన్నికల్లో నెగ్గి పెషావర్‌ నుంచి తొలి మహిళా ప్రొవిన్షియల్‌ ఎంపీగా రికార్డు సృష్టించారామె. దాంతో దేశ రాజకీయాల్లో ఆమె పేరు అందర్లోనూ నానింది.

ఈసారి కూడా ఆమె మళ్లీ బరిలో దిగుతున్నారు. అఫ్గాన్‌ సరిహద్దులకు సమీపంలో ఉండే పష్తూన్‌ ప్రాబల్య నగరమైన పెషావర్‌లో, పరిసర ప్రాంతాల్లో మహిళలపై అణచివేత మరింత అధికం. మహిళలపై తీవ్ర అణచివేతలకు పేరుమోసిన తాలిబన్ల ప్రభావం మరింత ఎక్కువ. దాంతో సమర్‌ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. గత ఎన్నికలప్పుడు మతోన్మాద మూకల బెదిరింపుల నేపథ్యంలో బిక్కుబిక్కుమంటూనే ప్రచారం చేశారు. ఈ ఐదేళ్లలో పరిస్థితులు కాస్త మెరుగయ్యాయంటారు సమర్‌. నిత్యం ప్రజల్లో తిరుగుతూ, వారి సమస్యలను వింటూ, ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండటం ఆమెకు బాగా పేరు తెచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement