హైవే దిగ్బంధం
-
వారాబందీ సక్రమంగా అమలు చేయాలని..
-
జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు
-
మూడున్నర గంటల పాటు ఆందోళన
-
భారీగా నిలిచిన వాహనాలు
బాల్కొండ:
గుత్ప ఎత్తిపోతల నీటి సరఫరాపై మళ్లీ వివాదం రాజుకుంది. వారాబందీ ప్రకారం సక్రమంగా నీటిని పంపిణీ చేయాలని బాల్కొండ, ఆర్మూర్ మండలాల్లోని చిట్టాపూర్, చేపూర్, ఫతేపూర్ రైతులు సోమవారం 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. మూడున్నర గంటల పాటు చిట్టాపూర్ కూడలి వద్ద బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. అన్ని గ్రామాలకు నీరందిస్తామని నీటిపారుదల శాఖ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన రైతులు నీటిని అడ్డుకుంటుండడంతో తమ గ్రామాలకు నీరు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరు అందక చెరువులు వెలవెలబోతున్నాయని, పంటలు ఎండుతున్నాయని వాపోయారు. ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ పిప్రి గ్రామస్తులకే వత్తాసు పలుతున్నాడని విమర్శించారు. అధికారులు అన్ని గ్రామాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ రూరల్ సీఐ నరసింహస్వామి, ఎస్సై స్వామిగౌడ్ వచ్చి రైతులకు సర్దిచెప్పేందుకు యత్నించారు. రాస్తారోకో విరమించేందుకు నిరాకరించిన రైతులు.. ఇరిగేషన్ ఎస్‌ఈ వచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని బీష్మించుకు కూర్చున్నారు. చివరకు ఆర్మూర్ ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ కృష్ణమూర్తి వచ్చి రైతులతో మాట్లాడారు. వారాబందీ ప్రకారం అన్ని గ్రామాలకు నీరందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.
భారీగా నిలిచిన ట్రాఫిక్
రైతులు మూడున్నర గంటల పాటు జాతీయ రహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గుత్ప నీటి కోసం వారం వ్యవధిలో చిట్టాపూర్ గ్రామస్తులు రోడ్డెక్కడం ఇది రెండోసారి. ఉదయం 11 నుంచి మద్యాహ్నం 2.30 గంటల వరకు రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.