
శరద్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: జనతా దళ్ (యు) నేత, రాజ్యసభ సభ్యుడు శరద్ యాదవ్ మరోసారి నోరు పారేసుకున్నారు. పార్లమెంటులో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన ఇపుడు ఆడబిడ్డల్ని ఘోరంగా అవమానించారు. అమ్మాయి గౌరవం కంటే.. ఓటును కాపాడుకోవడం ముఖ్యమంటూ సెలవిచ్చారు. ఆడ బిడ్డల గౌరవంకంటే బ్యాలెట్ చాలా ముఖ్యమైందన్న ఆయన బ్యాలెట్ పేపర్ ఎంత శక్తివంతమైందో ప్రజలకు అవగాహన కల్పించడం చాలా అవసరమని పేర్కొన్నారు.
అక్కడితో ఆగలేదు.. ఆడపిల్లల కంటే బ్యాలెట్ పేపర్ చాలా ముఖ్యం. మీ ఓటు విలువ మీ కుమార్తె గౌరవం కంటే పెద్దది.. ఒక అమ్మాయి గౌరవానికి భంగం కలిగితే.. ఆ కుటుంబానికి లేదా ఆ గ్రామానికి అవమానం.. కానీ ఓటు అమ్ముడుబోతే.. దేశ గౌరవానికే భంగం.. మన కలలన్నీ తుడుచుకుపెట్టుకుపోతాయంటూ చెప్పుకొచ్చారు.
విచక్షణ మరిచి నోరుజారడం... తప్పయిందంటూ క్షమాపణలు చెప్పడం శరద్ యాదవ్ కు కొత్తేమీ కాదు. అయితే ఒకవైపు ఆడబిడ్డల్ని కాపాడుకుందామంటూ ఉత్సవాలు జరుగుతోంటే... మరోవైపు సాక్షాత్తూ ఎంపీ ఇలాంటి అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం ఆందోళన రేపింది. రాజకీయనేతలు తరచూ చేసే ఇలాంటి వ్యాఖ్యలు స్త్రీలపై దాడికి పురికొల్పుతాయంటూ మహిళా సంఘాల నేతలు మండి పడుతున్నారు.