
నువ్వేంటో నాకు తెలుసు!
- స్మృతి ఇరానీపై శరద్ యాదవ్ వ్యాఖ్య
- రాజ్యసభలో కేంద్రమంత్రితో జేడీయూ చీఫ్ వాగ్వాదం
న్యూఢిల్లీ: మహిళల శరీరం, రంగుపై రాజ్యసభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా మరో వివాదానికి తెరతీశారు. సోమవారం రాజ్యసభలో ఆయన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘నువ్వేంటో నాకు తెలుసు’ అని అన్నారు. మహిళల రంగుపై వ్యాఖ్యలు చేయొద్దని ఇరానీ అనడంతో పైవిధంగా స్పందించారు. ‘ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఎంతో ముఖ్యమైన వర్ణవివక్షను లేవనెత్తాను. దీనిపై ఎప్పుడైనా సరే చర్చకు సిద్ధం’ అని అన్నారు.
ఇరానీ స్పందిస్తూ.. ‘ఏ మహిళల రంగుపైనా ఇలా మాట్లాడొద్దని మీ(సభాపతి) ద్వారా ఆయన(యాదవ్)కు విజ్ఞప్తి చేస్తున్నా. మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. మీరు(యాదవ్) సీనియర్ సభ్యులు. చాలా తప్పుడు సందేశం పోతోంది’ అని అన్నారు. యాదవ్ ప్రతిస్పందిస్తూ.. ‘గాంధీ నుంచి లోహియా వరకు మహిళలపై ఏమన్నారో నా దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి. నల్లరంగు మహిళల సంక్షేమం కోసం ఎంతో పోరాటం జరిగింది’ అని చెప్పారు. ఇరానీ మళ్లీ లేచి, ‘దయచేసి లోహియా, గాంధీల పేర్లు చెప్పొద్దు..’ అని అన్నారు. గత గురువారం రాజ్యసభలో బీమా బిల్లుపై చర్చలో తను చేసిన వ్యాఖ్యలను యాదవ్ సమర్థించుకున్నారు.
‘నల్లరంగు మహిళలు భారత్‌లో ఎంతోమంది, ప్రపంచంలో చాలా మంది ఉన్నారన్నాను. వారి కోసం లోహియా, ఇతరులు చేసిన పోరాటంపై ఎవరితోనైనా చర్చించడానికి నేను సిద్ధం’ అని వ్యాఖ్యానించారు. కాగా, అన్ని పార్టీల మహిళా సభ్యులందరూ ఏకతాటిపై ఉన్నారని, యాదవ్ పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని డీఎంకే సభ్యురాలు కనిమొళి డిమాండ్ చేశారు. గురువారం యాదవ్ సభలో మాట్లాడుతూ భారతీయులకు తెల్లరంగుపై ప్రేమ అని అన్నారు.
‘మీ దేవుడు రవిశంకర్ ప్రసాద్(కేంద్రమంత్రి)లా నల్లనివాడు. అయితే వివాహ సంబంధాల ప్రకటనల్లో మాత్రం మీరు తెల్లరంగు వధువులు కావాలంటారు. దక్షిణాది మహిళలు నల్లగా ఉన్నా అందంగా ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. యాదవ్ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, వాటిని ఆయన వాపసు తీసుకోవాలని రవిశంకర్ ప్రసాద్ సోమవారం రాజ్యసభలో అనడంతో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.