ముంబై: మహిళల ఆధ్వర్యంలో నడిచే వినూత్నమైన స్టార్టప్‌లకు మద్దతుగా నిలవకపోవడం పట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ (వీసీ) తీరును కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ‘నేటికీ పురుషుల ఆధ్వర్యంలోని కంపెనీలతో పోలిస్తే మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్ కంపెనీలపై వెంచర్ క్యాపిటలిస్ట్‌లు ఆసక్తి చూపడంలేదు’ అని మెంటార్ మైబోర్డ్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఇరానీ పేర్కొన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎంతో మంది మహిళా ఆవిష్కర్తలు ఉన్నట్టు చెప్పారు. వారి ప్రయత్నాలు వాణిజ్య వెంచర్లుగా రూపాంతరం చెందడం లేదన్న ఆవేదనను ఆమె వ్యక్తం చేశారు. వినూత్నంగా ఉంటున్నప్పటికీ కార్పొరేట్ బోర్డుల్లో ఎంత మంది మహిళలకు చోటు లభించిందో పరిశీలించాలని సూచించారు. మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాల్సిన అవసరం లేదన్న మంత్రి స్మృతి ఇరానీ ఇటీవలి వ్యాఖ్యలపై విమర్శలు రావడం తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలను ఆమె సమర్థించుకున్నారు. ‘‘మీ కంపెనీ హెచ్‌ఆర్ హెడ్ ప్రతి నెలా మీ నెలసరిని అడిగి తెలుసుకునే పరిస్థితిని ఊహించగలరా?’’అని ఆమె ప్రశ్నించారు.
నెలసరి సెలవు ఇవ్వడం ప్రస్తుత చట్టాలకు సైతం విరుద్ధమన్నారు. ‘‘మహిళలు పెళ్లి చేసుకుంటే, పిల్లల కారణంగా పురోగతి చూపించలేరని గతంలో వారికి అవకాశాలు తిరస్కరించడాన్ని చూశాం. ఇప్పుడు నెలసరి రూపంలో వారికి ఉపాధిని నిరాకరించే పరిస్థితిని సృష్టించడం అవసరం అంటారా?’’అని ఇరానీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే విషయంలో ఒకే విధానం సరికాదన్నారు. సంప్రదింపుల నైపుణ్యాలను విద్యార్థుల్లో, ముఖ్యంగా మహిళా విద్యార్థుల్లో కలి్పంచడంపై దృష్టి సారించాలని బిజినెస్ స్కూళ్లకు ఆమె సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment