వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ‘టెక్నాలజీ పయనీర్స్ 2024’ జాబితాలో దేశంలోని పది కంపెనీలు చోటు సంపాదించాయి. కృత్రిమ మేధ (ఏఐ)తో సరికొత్త ఆవిష్కరణలు చేసిన 100 స్టార్టప్ కంపెనీలతో ఈ జాబితా రూపొందించారు. అందులో హైదరాబాద్‌కు చెందిన నెక్ట్స్‌వేవ్ కంపెనీ స్థానం దక్కించుకోవడం విశేషం.
నెక్ట్స్‌వేవ్..
ఏదో ఒకకోర్సు నేర్చుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరగానే సరిపోదు. నిత్యం కొత్త అంశాలు నేర్చుకుంటేనే ఉద్యోగంలో నిలదొక్కుకోగలం. ఆ దిశగా పని చేస్తోంది ‘నెక్ట్స్‌వేవ్’. ఐఐటీల్లో చదివిన హైదరాబాదీ యువకులు శశాంక్ రెడ్డి, రాహుల్, అనుపమ్ కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ సంస్థను స్థాపించారు. కంటిన్యూయస్ కెరీర్ బిల్డింగ్ ప్రోగ్రాం(సీసీబీపీ) పేరిట కాలేజీల నుంచి గ్యాడ్యుయేట్లుగా బయటకు వచ్చే విద్యార్థులకు కంపెనీల్లో అవసరమయ్యే ఐఓటీ, ఏఐ, ఫుల్‌స్టాక్ తదితర స్కిల్స్ నేర్పించడం దీని ఉద్దేశం.
దేశంలో డిగ్రీ అయిపోయాక ఖాళీగా ఉంటున్న దాదాపు 60 శాతం మందిని నిపుణులుగా తీర్చిదిద్దాలనేది సంస్థ లక్ష్యం. ఇక్కడ శిక్షణ పొందిన వారు ప్రముఖ సంస్థల్లో కొలువు దక్కించుకొని, నైపుణ్యాలకు సానబట్టే వేదిక దొరికితే దూసుకెళ్తామని నిరూపించారు కూడా. దేశవ్యాప్తంగా మూడు వేల కాలేజీలకు చెందిన 2 లక్షల మంది విద్యార్థులు ఈ స్టార్టప్ కమ్యూనిటీలో భాగస్వాములయ్యారు. ఫ్రెషర్స్‌తో పాటు వివిధ కారణాల వల్ల కెరియర్‌లో గ్యాప్ వచ్చిన, వేరే రంగంలో పనిచేసిన వారికీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పించే బాధ్యత తమదేనని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. పనితీరుతో ఇన్వెస్టర్లనూ మెప్పించి.. గతంలో రూ.21 కోట్ల క్యాపిటల్‌ను సాధించారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయితేనే సాఫ్ట్‌వేర్ రంగంలో నిలదొక్కుకోవచ్చని చెబుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఉద్యోగాల కల్పనకు సహాయం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏడాదికి పది లక్షల మంది నిపుణులను తయారు చేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలుపుతున్నారు.
ఐటీ పరిశ్రమలో లేఆఫ్స్.. ఇప్పుడేం చేయాలంటే..
ఐటీ పరిశ్రమలో ప్రముఖ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరుతో కొంతకాలంగా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగంలోని సాఫ్ట్‌వేర్ల అప్‌డేషన్ అగిపోయింది. బ్యాంకింగ్ వెబ్‌సైట్లు, యాప్‌ల్లో కొత్త ఫీచర్లు అందించాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. దానికితోడు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్‌లు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు భారీగా పెరిగాయి. ఇవిచాలవన్నట్లు అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితులు నెలకొంటున్నాయి. దాంతో ఐటీ కంపెనీల లాభాలు భారీగా తగ్గుతున్నాయి. ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించి..తిరిగి పరిస్థితులు గాడినపడితే ఐటీ రంగం పుంజుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆలోపు కొత్తగా ఉద్యోగాలు కోసం చూస్తున్నవారు నిరాసక్తి చెందకుండా నైపుణ్యాలు పెంచుకోవాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment