
జెనరేటివ్ ఏఐ స్టార్టప్‌లకు అమెజాన్ వెబ్ సర్వీస్ (ఏడబ్ల్యూఎస్) సహకారం అందించనున్నట్లు తెలిపింది. జెనరేటివ్ ఏఐ విభాగంలో సేవలందించే స్టార్టప్ కంపెనీలకు ఏకంగా 230 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,000 కోట్లు) మేర సాయం చేయాలని నిర్ణయించుకుంది.
ఏడబ్ల్యూఎస్ అంతర్జాతీయంగా జెనరేటివ్ ఏఐ యాక్సిలరేటర్ కార్యక్రమాన్ని విస్తరించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఈ రంగంలో సేవలందించే అంకురాలకు ఆర్థికసాయం చేయలని నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1 నుంచి 10 వారాల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 80 వ్యవస్థాపకులు, అంకుర సంస్థలకు సహకారం అందించనున్నట్లు ప్రకటించింది. వీటిల్లో ఆసియా పసిఫిక్, జపాన్ ప్రాంతం నుంచే 20 వరకు ఉండనున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఈ సంస్థల వృద్ధిని పెంచడమే ఈ నిధుల సహకారం ప్రధానం ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ఎంపికైన ఒక్కో జెన్‌ఏఐ స్టార్టప్‌కు 1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.8.3 కోట్లు) మేర ఆర్థిక వెసులుబాటు కల్పించనున్నారు. దాంతోపాటు ఏడబ్ల్యూఎస్ తరఫున ఆయా కంపెనీలకు నైపుణ్యాభివృద్ధి సెషన్‌లు, వ్యాపారం, సాంకేతికత అంశాలపై సలహాలు, నెట్‌వర్కింగ్ అవకాశాలు తదితర సహకారాన్ని అందిస్తామని ఏడబ్ల్యూఎస్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment