ముంబై: గత కేలండర్ ఏడాది(2021) డీల్స్‌పరంగా అత్యుత్తమమని కన్సల్టింగ్, అడ్వయిజరీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్ రూపొందించిన నివేదిక పేర్కొంది. మొత్తం 2,224 లావాదేవీలు నమోదుకాగా.. 2020లో జరిగిన లావాదేవీలతో పోలిస్తే 867 అధికమని తెలియజేసింది. ఇక వీటి విలువ సైతం 37 బిలియన్ డాలర్లు అధికంగా 115 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలియజేసింది. వెరసి అటు డీల్స్, ఇటు విలువపరంగా రికార్డ్ నమోదైనట్లు నివేదిక తెలియజేసింది. వీటిలో 42.9 బిలియన్ డాలర్ల విలువైన 499 లావాదేవీలు విలీనాలు, కొనుగోళ్లు జరిగినట్లు వెల్లడించింది.
ఈకామర్స్ స్పీడ్
గతేడాది 48.2 బిలియన్ డాలర్ల విలువైన 1,624 ప్రయివేట్ ఈక్విటీ డీల్స్ జరిగాయి. 101 ఐపీవోలు, క్విప్‌ల ద్వారా 23.9 బిలియన్ డాలర్ల లావాదేవీలు నమోదుకాగా.. వీటిలో 65 పబ్లిక్ ఇష్యూల వాటా 17.7 బిలియన్ డాలర్లు. ఇది కూడా రికార్డే! ఐపీవోలలో స్టార్టప్‌లు, ఈకామర్స్, ఐటీ కంపెనీల హవా కనిపించింది. ఏకంగా 33 యూనికార్న్‌లు ఊపిరిపోసుకున్నాయి. ఇక భారీ డీల్స్‌లోనూ 2021 రికార్డులు సాధించింది. బిలియన్ డాలర్ల విలువలో 14 డీల్స్ జరిగాయి. 99.9–50 కోట్ల డాలర్ల మధ్య మరో 15 లావాదేవీలు నమోదయ్యాయి. ఈ బాటలో 49.9–10 కోట్ల డాలర్ల పరిధిలోనూ 135 డీల్స్‌కు గతేడాది తెరతీసింది. డీల్స్ సంఖ్యలో ఇవి 8 శాతమే అయినప్పటికీ విలువలో 80 శాతంకావడం గమనార్హం!
భారీ డీల్స్
గతేడాది జరిగిన లావాదేవీలలో 76 శాతం దేశీయంగా నమోదయ్యాయి. మిగిలినవి విదేశీ డీల్స్. ఇదేవిధంగా 1,624 డీల్స్ ద్వారా 48.2 బిలియన్ డాలర్లతో పీఈ పెట్టుబడులు కొత్త రికార్డులు నెలకొల్పాయి. వీటిలో 10 కోట్ల డాలర్లకు మించినవి 112 కాగా.. 66 శాతం నిధులు స్టార్టప్‌లలోకి ప్రవేశించడం ప్రస్తావించదగ్గ అంశం! వీటిలోనూ మళ్లీ 32 శాతం ఈకామర్స్ సంస్థలలోకి మళ్లాయి. రిటైల్, కన్జూమర్, ఎడ్యుకేషన్, ఫార్మా రంగ సంస్థలు పెట్టుబడులను బాగా ఆకట్టుకున్నాయి. పీఈ లావాదేవీల్లో 10 శాతాన్ని ఆక్రమించాయి. మరోపక్క 36 కంపెనీలు 2021లో క్విప్‌ల ద్వారా 6.2 బిలియన్ డాలర్లు సమీకరించాయి. వెరసి 2011 తదుపరి క్విప్ మార్గంలో అత్యధిక నిధుల సమీకరణ నమోదైంది. దివాలా చర్యలకు లోనైన దివాన్ హౌసింగ్(డీహెచ్‌ఎఫ్‌ఎల్)ను 5.1 బిలియన్ డాలర్లకు పిరమల్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి:స్టాక్ మార్కెట్ ర్యాలీ.. 4 రోజుల్లో రూ.9.30 లక్షల కోట్ల సంపద
Comments
Please login to add a commentAdd a comment