
దక్షిణాది మహిళల అందాన్ని మాత్రమే వర్ణించారా?
న్యూఢిల్లీ : మహిళలపై జేడీయూ అధినేత శరద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఆయనపై యావత్ మహిళాలోకం మండిపడుతోంది. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధా...లేక ఆ రూపంలో ఉన్న పోకిరియా అంటూ దుమ్మెత్తి పోస్తోంది. బీమా బిల్లుపై చర్చ సందర్భంగా శుక్రవారం శరద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు శాతాన్ని పెంచటాన్ని...ఆయన భారతదేశ పురుషులకు తెల్ల మహిళలపై ఉన్న ఆసక్తిని పోల్చుతూ వర్ణించారు. దక్షిణాది మహిళలు నల్లగా ఉన్నా చాలా అందంగా ఉంటారని...వారు నృత్యాలు చేస్తుంటే కళ్లు తిప్పుకోలేమన్నారు. వారికి ఎంతటివారినైనా ఆకట్టుకునే అందం ఉందన్నారు. అలాంటి వాళ్లు ఉత్తరభారతంలో కన్పించరని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై పలువురు మహిళా ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శరద్ యాదవ్ వ్యాఖ్యలు దక్షిణాది మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఆందోళనకు దిగారు. వెంటనే ఉపసంహరించుకుని.... దేశంలోని మహిళలందరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అటు కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ కూడా శరద్‌యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టాయి.
క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టాయి. అయితే శరద్‌యాదవ్ అందుకు అంగీకరించలేదు. తానెవరనీ విమర్శించలేదని...కేవలం దక్షిణాది మహిళల అందాన్ని మాత్రమే వర్ణించానని చెప్పారు. విమర్శలు వెల్లువెత్తుతుండడంతో.... పార్టీ అధ్యక్షుడి తరపున జేడీయూ ఎంపీ కేసీ త్యాగి క్షమాపణలు చెప్పారు.