
క్షమాపణతో సరిపెడితే ఎలా?
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై రాజ్యసభలో విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడి ఇప్పుడు క్షమాపణ చెబితే సరిపోతుందా అని సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి ప్రశ్నించారు. రాజ్యాంగంపై విశ్వాసంలేని వ్యక్తిని మంత్రిగా ఎలా కొనసాగిస్తారని నిలదీశారు.
క్షమాపణ చెప్పారంటే తప్పు చేసినట్టేనని జేడీ(యూ) అధినేత శరద్ యాదవ్ అన్నారు. తప్పుచేసిన మంత్రిని క్షమాపణతో సరిపెడితే ఎలా అని ప్రశ్నించారు. నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసినా విపక్షాలు శాంతించలేదు.