శరద్ యాదవ్‌కు నితీశ్ ఝలక్
సాక్షి, ఢిల్లీ: జనతా దళ్(యునైటెడ్) మాజీ అధ‍్యక్షుడు, సీనియర్ నేత శరద్ యాదవ్‌కు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గట్టి ఝలక్ ఇచ్చారు. రాజ్యసభలో పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న శరద్ ఆ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు జేడీయూ అధికారికంగా ప్రకటించింది.
ఈ మేరకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ స్పీకర్ అయిన వెంకయ్యనాయుడుకు పార్టీ సమాచారాన్ని తెలియజేసింది. అంతేకాదు కొత్త ప్రతినిధిగా నితీశ్ సన్నిహితుడు ఆర్‌సీపీ సింగ్ పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. ఇంతకు ముందు మరో రాజ్యసభ సభ్యుడు అన‍్వర్ అలీపై కాంగ్రెస్ నిర్వహించిన బీజేపీ వ్యతిరేక సమావేశంలో పాల్గొనటంతో వేటు వేసిన విషయం తెలిసిందే.
మొత్తం జేడీయూ తరపున పార్లమెంట్‌లో ఇద్దరు లోక్ సభ ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన మద్ధతుదారులను సేకరించే పనిలో భాగంగా రాష్ట్రవ్యాప్త పర్యటనకు శరద్ సిద్ధమవుతున్న వేళ తాజా వేటుతో కొత్త పార్టీ ఏర్పాటు దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది.