ఉపేంద్ర కుష్వాహా- శరద్ యాదవ్ భేటీ
పట్నా : చీలిక దిశగా బిహార్‌లో ఎన్డీయే కూటమి మలుపులు తిరుగుతోంది. లోక్‌సభ సీట్ల పంపకంతో మొదలైన వీరి విభేదాలు సొంత కూటమిలోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే వరకు చేరింది. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీ ఆర్‌ఎల్‌ఎస్పీ అధినేత, కేంద్రమంత్రి ఉపేందర్ కుష్వాహా సోమవారం శరద్ యాదవ్‌తో భేటీ అయ్యారు. వారి భేటీ బిహార్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో శరద్‌ను కలిసిన ఉపేంద్ర రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఆయనకు వివరించినట్లు సమాచారం. ఎన్డీయే కూటమిలో భాగంగా బీజేపీ, జేడీయూ మధ్య కుదిరిన లోక్‌సభ సీట్ల పంపిణీపై భాగస్వాయ్య పార్టీలైన ఎల్‌జేపీ, ఆర్‌ఎల్‌ఎస్పీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
కూటమిలో సరైన ప్రాతినిథ్యం లేని పక్షంలో తమ దారి తాము చూసుకుంటామని ఎల్‌జేపీ, ఆర్‌ఎల్‌ఎస్పీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్‌ఎల్‌ఎస్పీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జేడీయూ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ కిషోర్‌తో రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలపై ఉపేంద్ర స్పందించారు. బిహార్ సీఎం నితీష్ కుమార్‌పై తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎరగా చూపి జేడీయూలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీలకు చీల్చడంలో నితీష్ ఘనుడని ఆయనపై మండిపడ్డారు.
కాగా రాష్ట్రంలో ఎన్డీయేలో విభేదాలన్నింటికీ మూలకారణం సీట్ల పంపకమేనని కూటమిని నేతలు భావిస్తున్నారు. మిత్ర పక్షాలను సంప్రధించకుండా బీజేపీ, జేడీయూ లోక్‌సభ సీట్లలో 20-20 చొప్పున పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయని ఎల్‌జేపీ నేతలు అసంతృత్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అవుతామని ఎల్‌జేపీ నేత కేంద్రమంత్రి, రామ్‌విలాస్ పాశ్వాన్, ఉపేంద్ర కుష్వాహా తెలిపారు. కాగా 40 లోక్‌సభ స్థానాలు గల బిహార్‌లో గత ఎన్నికల్లో బీజేపీ 20, ఎల్‌జేపీ ఏడు, ఆర్‌ఎల్‌ఎస్పీ మూడు స్థానాల్లో విజయం సాధించగా, జేడీయూ కేవలం రెండుస్థానాలకే పరితమైంది.
Comments
Please login to add a commentAdd a comment