నితీశ్‌కు ఝలక్: శరద్ యాదవ్ బిగ్ స్టెప్!
పట్నా: జనతాదళ్ (యునైటెడ్) (జేడీయూ)లో ఇద్దరు కీలక నేతలైన నితీశ్‌కుమార్, శరద్‌యాదవ్ మధ్య దూరం నానాటికీ పెరిగిపోతున్నది. నితీశ్‌కుమార్ తీరు పట్ల అసంతృప్తితో ఉన్న శరద్ యాదవ్ సొంత కుంపటి పెట్టే దిశగా సాగుతున్నారు. జేడీయూను చీల్చి.. తన మద్దతుదారులతో కొత్త పార్టీ పెట్టే దిశగా ఆయన సాగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అహ్మద్ పటేల్‌కు అభినందలు తెలుపడం ద్వారా శరద్ యాదవ్ ఈ దిశగా పెద్ద ముందడుగు వేశారని భావిస్తున్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలను చిత్తుచేస్తూ.. అహ్మద్ పటేల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. గెలిచిన వెంటనే అహ్మద్‌కు శరద్ యాదవ్ అభినందనలు తెలిపారు. కఠినమైన సవాళ్లను ఎదుర్కొని రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ గెలుపొందారంటూ.. ఆయనతో తాను దిగిన ఫొటోను ట్వీట్ చేశారు.
ఇటీవల ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహాకూటమిని వీడి నితీశ్‌కుమార్ మళ్లీ బీజేపీతో జత కట్టిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి నితీశ్‌కు శరద్ యాదవ్ దూరంగా ఉంటున్నారు. మొదట సీఎం నితీశ్‌పై నేరుగా విమర్శలు చేయనప్పటికీ, ఆయన మిత్రపక్షమైన బీజేపీపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. మళ్లీ బీజేపీతో జతకట్టాలన్న నితీశ్ నిర్ణయం దురదృష్టకరమన్న శరద్.. ఇక ఆయనతో వేరుపడటం తన ముందున్న మార్గమని చెప్పకనే చెప్పారు. ఆయన త్వరలోనే కొత్త పార్టీ పెట్టే అవకాశముందని ఆయన సన్నిహితులు కూడా చెప్తున్నారు. జేడీయూలోని తన మద్దతుదారులందరినీ తనవైపు తిప్పుకొని.. ఆ తర్వాత కొత్త పార్టీ పెట్టాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, ఆర్జేడీ తదితర ప్రతిపక్ష పార్టీలతో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో అహ్మద్ పటేల్‌కు అభినందనలు తెలుపడం ద్వారా తాను ఎవరి వెంట కలిసి సాగనున్నారో శరద్ యాదవ్ స్పష్టం చేసినట్టు భావిస్తున్నారు.