శరద్ భాయ్.. గమ్మునుండు!
- ఏదైనా ఉంటే పార్టీలో మాట్లాడుకుందాం: నితీశ్ చురక
- బీజేపీతో దోస్తీపై జేడీయూలో చర్చ
పట్నా: ‘ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదికాదు. బీజేపీతో జేడీయూ కలవడం దురదృష్టకరం’ అంటూ బిహార్ పరిణామాలపై నిక్కచ్చిగా మాట్లాడిన పార్టీ సీనియర్ నేత, ఎంపీ శరద్ యాదవ్‌కు సీఎం నితీశ్ కుమార్ గట్టి జవాబిచ్చారు. ‘పార్టీ నిర్ణయాలపై మండిపాటు తగదని, ఏదైనా ఉంటే పార్టీ సమావేశంలో మాట్లాడుకుందాం’అని శరద్‌కు నితీశ్ సూచించారు.
ఎన్నికల తీర్పునకు విరుద్ధంగా నితీశ్ కుమార్.. మహాకూటమి నుంచి బయటికివచ్చి, బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తీరుపై శరద్ యాదవ్ సహా జేడీయూలోని పలువురు సీనియర్లూ బాహాటంగా నిరసించారు. అయితే, నితీశ్‌కుమార్ వాదన మరోలాఉంది. శరద్‌యాదవ్‌ను, ఇతర ముఖ్యులకు సమాచారం ఇచ్చిన తర్వాతే జేడీయూ మహాకూటమి నుంచి బయటికి వచ్చిందని నితీశ్ మీడియాకు వివరించారు.
ఈ గందరగోళ పరిస్థితుల్లోనే ఆగస్టు 19న పట్నాలో జేడీయూ కీలక సమావేశం జరగనున్నాయి. పార్టీ అధ్యక్షుడు నితీశ్‌కుమార్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో.. ఆర్జేడీ(లాలూ ప్రసాద్)తో దోస్తీకి స్వస్తి, బీజేపీతో పొత్తు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై పార్టీ నేతలు చర్చించనున్నారు. జేడీయూ తిరిగి ఎన్డీయేలోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో పదవులు స్వీకరించాలా? వద్దా? అనేదానిపైనా ఈ సమావేశాలలోనే నిర్ణయం తీసుకోనున్నారు.