పట్నా: ఎన్డీయే సంకీర్ణ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో బిహార్‌లోని నితీష్‌కుమార్ జేడీ(యూ) కీలకంగా మారింది. బీజేపీ సొంతంగా మెజార్టి సీట్లు దక్కించుకోని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నితీష్ కుమార్‌కి డిప్యూటీ పీఎం పదవి ఆఫర్ చేసి.. తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జేడి(యూ) నేత కేసీ త్యాగి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
‘‘ జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్‌కి ఇండియా కూటమి నుంచి ఏకంగా ప్రధాన మంత్రి పదవి ఆఫర్ వచ్చింది. ఇండియా కూటమికి కన్వీనర్‌గా అంగీకరించని వాళ్లు.. ఏకంగా నితీష్‌కు ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేశారు. అందుకే నితీష్ వాళ్ల ఆఫర్‌ను తిరస్కరిచారు. తాము ఎన్డీయేతోనే ఉన్నాం. మళ్లీ ఇండియా కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదు. మా మద్దలు ఎన్డీయే ఉంటుంది’’ అని అన్నారు.
అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టి సొంతంగా బీజేపీ, కాంగ్రెస్ కూటమికి లేకపోవటంతో నితీష్ కుమార్‌పై మద్దతును కీలకంగా మారింది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి ఆయన మద్దతు కోరినట్లు త్యాగి తెలిపారు. తరచూ కూటములు మారుతారనే పేరు నితీష్ కుమార్ ఉన్న విషయం తెలిసిందే.
ఇండియా కూటమి ఏర్పాటులో మొదటిగా నితీష్ కుమారే కీలకంగా వ్యవహరించారు. పట్నాలో జరిగిన మొదటి సమావేశానికి సైతం అధ్యక్షత వహించారు. అయితే.. ఎన్నికల ముందు ఈ ఏడాది జనవరిలో సీఎం పదవి రాజీనామా చేసి మరీ ఎన్డీయే కూటమిలో చేరిపోయారు.
ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ జేడీ(యూ) 12 ఎంపీ స్థానాలను గెలుచుకొని ఎన్డీయే కూటమిలో మూడో స్థానంలో ఉంది. శుక్రవారం భాగస్వామ్య పార్టీలు ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కోలువుదీరనుంది. రేపు (ఆదివారం) 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు.
స్పందించిన కాంగ్రెస్
తమ పార్టీ చీఫ్‌కు నితీశ్‌కుమార్‌కు ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవి అఫర్ చేసిందని జేడీ(యూ) నేత త్యాగి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘ జేడీ(యూ) నేత త్యాగి చెప్పినటువంటి సమాచారం మా వద్ద లేదు’’ అని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. త్యాగి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment