పుట్టినప్పుడే నన్ను చంపేయమన్నారు
అయినా మా అమ్మ ధైర్యంగా పెంచింది: స్మృతి ఇరానీ
భోపాల్: ‘‘నేను పుట్టినప్పుడు.. ఆడపిల్ల అంటే జీవితాంతం పెను భారమన్నారు. గొంతు పిసికి చంపేయాలని నా తల్లికి కొంతమంది సూచించారు. కానీ మా అమ్మ ఆ పని చేయలేదు. ఆమె ధైర్యంగా నన్ను పెంచింది. అందువల్ల నేను ఈ రోజు మీ అందరి ముందూ నిలబడ్డా’’ ఈ మాటలన్నది ఎవరో కాదు.. సాక్షాత్తు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ. శుక్రవారం భోపాల్‌లోని ఓ స్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ తన చిన్ననాటి సంగతులను తొలిసారిగా గుర్తు చేసుకున్నారు. కొందరి సలహాలు వినకుండా తనను పెంచి పెద్ద చేసినందుకు తన తల్లికి ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికీ దేశంలో ఆడపిల్ల అంటే భారంగానే భావిస్తున్నారని, వారిని పురి టిలోనే చంపేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శిశు భ్రూణహత్యల నియంత్రణకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆమె చెప్పారు.