ఆధునిక టెక్నాలజీని ఆ మహిళలు అంది పుచ్చుకున్నారు. నిరక్షరాస్యత వ్యాపారాభివృద్ధికి అడ్డు కాదని నిరూపించారు. కాస్త తెలివి, కొంచెం డబ్బు ఉంటే చాలు... చదువు లేకపోయినా ఏకంగా స్వంత కంపెనీ స్థాపించారు. తమిళనాడులోని సుమారు వెయ్యిమంది మహిళలు ఒక్కతాటిపైకి వచ్చి మొబైల్ ఫోన్ వినియోగం (వాయిస్ మెయిల్) ద్వారా మేకల పెంపకంలో మెళకువలను నేర్చుకున్నారు. శాస్త్రీయ చిట్కాలను, పశువుల ఆరోగ్య రక్షణను వాయిస్ మెయిల్ ద్వారా తెలుసుకుంటూ... 'వాయిస్ మెయిల్ ఫార్మర్స్' గా గుర్తింపు పొందారు.
సుమారు పదిహేనేళ్ళక్రితం నిరక్షరాస్యులైన వెయ్యిమంది మహిళలు (వాయిస్ మెయిల్ ఫార్మర్స్) స్థాపించిన కంపెనీ ఎందరో మహిళలకు స్ఫూర్తినిస్తోంది. ప్రస్తుతం 1,300 మంది మహిళల భాగస్వామ్యంతో ప్రారంభించిన స్వంత కంపెనీ... స్థానిక మహిళాభివృద్ధికి బాటలు వేసింది. పచ్చదనం నడుమ... బోడి వెస్ట్ హిల్స్ ప్రాంతంలో గోట్ ఫార్మర్స్ కంపెనీ ఏర్పాటై... చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు సైతం సహాయ సహకారాలు అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఒక్కొక్కరు వెయ్యి రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టి... థేని జిల్లా కేంద్రంగా మేకల రైతులు స్థాపించిన 'గోట్ ఫార్మర్స్ కంపెనీ లిమిడెడ్' స్థానిక మహిళల సత్తాను చాటుతోంది.
ఐకమత్యమే మహా బలం అన్న చందంగా... ఆ మహిళా రైతులు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. స్వంత కంపెనీ స్థాపించి అభివృద్ధి పథంలో నడుస్తున్నారు. మేకల రైతులు వారి మేకలను మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా అమ్ముకునేందుకు ఈ కంపెనీ సహాయపడుతుంది. మేకలకు కావాల్సిన గ్రాసం, మందులు వంటివి కూడ ఈ కంపెనీ ద్వారా కొనుగోలు చేసి, పంపిణీ చేస్తారు. అనుకున్న ప్రణాళికలను అమలు పరుస్తూ వందశాతం నాణ్యతను అందించేందుకు ఈ మహిళా రైతులు చేస్తున్నారు. ఇటీవల థేని కలెక్టర్ ఎన్. వెంకటాచలం ఈ గోట్ ఫార్మర్స్ కంపెనీని ప్రారంభించారు. సంస్థలోని పదిమంది బోర్డు మెంబర్లలో ఎనిమిది మంది మహిళా మెంబర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీకి, స్థానిక సామాజిక సంస్థ విడియాల్ సాంకేతిక సహాయం అందిస్తోంది.
అభివృద్ధి పథంలో 'వాయిస్ మెయిల్ ఫార్మర్స్'
Published Thu, Jan 7 2016 8:08 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement