మెదక్‌కు ప్రవీణ్ లేదా ప్రభాకర్ రెడ్డి..? | medak candidate trs Praveen or Prabhakar Reddy | Sakshi
Sakshi News home page

మెదక్‌కు ప్రవీణ్ లేదా ప్రభాకర్ రెడ్డి..?

Published Tue, Aug 26 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM

medak  candidate trs Praveen or Prabhakar Reddy

దేవీప్రసాద్‌ను బుజ్జగిస్తున్న స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్
అభ్యర్థిత్వంపై పార్టీ  {పముఖులతో సీఎం చర్చలు

 
హైదరాబాద్: మెదక్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉపఎన్నికలో  టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డి, కుంభాల ప్రవీణ్‌రెడ్డిలతోపాటు పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే పార్టీ టికెట్ ప్రవీణ్‌రెడ్డికే దక్కనుందని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. అభ్యర్థి, గెలుపు వ్యూహంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మెదక్ జిల్లాపార్టీ ముఖ్యులతో సోమవారం సాయంత్రం చర్చించారు. ఆశా వహులంతా నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చునని కేసీఆర్ సూచించారు. మెదక్ ఆశావహులు ఎవరున్నారని జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణను కేసీఆర్ అడిగారు. దీంతో దేవీప్రసాద్, కె.భూపాల్ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి,ప్రవీణ్ రెడ్డి తదితరుల పేర్లను ఆయన వివరించారు. ఈ దశలో పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు జోక్యం చేసుకుని, వారిపేర్లు చెబుతున్న ఆర్.సత్యనారాయణ కూడా టికెట్‌ను ఆశిస్తున్నారని చెప్పారు. దీంతో ఈ ఐదుగురి పేర్లను అభ్యర్థిత్వం కోసం పరిశీలిస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. మెదక్‌లో ఉపఎన్నిక పూర్తయ్యేదాకా ఆరుగురు మంత్రులు, ఐదుగురు ఎంపీలు,పలువురు ఎమ్మెల్యేలు పార్టీ గెలుపు బాధ్యతను నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా మంత్రులు పద్మారావు (గజ్వేల్),టి,రాజయ్య( సంగారెడ్డి), కేటీఆర్(మెదక్),జోగురామన్న(నర్సాపూర్), హరీశ్‌రావు(సిద్దిపేట), ఈటె ల రాజేందర్(పటాన్ చెరు)లు ఇన్‌చార్జిలుగా వ్యవహరించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేతోపాటు మండలానికి ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ ఇన్‌చార్జిగా ఉంటారు.

ఎన్నికలయ్యేదాకా వీరు అక్కడే ఉండి కార్యకర్తలను సమన్వయం చేస్తారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేలకు తక్కువ కాకుండా మెజారిటీ వచ్చే విధంగా వ్యూహం ఉండాలని కేసీఆర్ ఆదేశిం చారు.  టికెట్‌ను ఆశిస్తున్న టీఎన్‌జీఓ అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ను బుజ్జగించడానికి శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రయత్నిస్తున్నారు. దేవీప్రసాద్‌కే టికెట్ ఇవ్వాలని ఉద్యోగసంఘాలు,నేతలు ఇదివరకే కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినసంగతి తెలిసిందే.  ఆయనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని కేసీఆర్ వర్తమానం పంపినట్టు తెలిసింది. బుజ్జగించడానికి స్వామిగౌడ్ ను, శ్రీనివాస్‌గౌడ్‌ను పంపడంపై దేవీప్రసాద్ ఆవేదన చెందుతున్నారు.  మా ఇద్దరి మధ్య మధ్యవర్తులు అవసరమా?’ అని తన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement