
ఆళ్లగడ్డను విస్మరించిన ఎలక్షన్ కమిషన్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం షెడ్యూల్ ప్రకటించింది. మెదక్ లోక్సభ, నందిగామ అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది. 16న ఓట్ల లెక్కింపు చేపడతారు. కాగా ఈ నెల 20న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 28న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణకు 30 వరకు గడువు.
అయితే ఎన్నికల కమిషన్ ఆళ్లగడ్డను విస్మరించింది. ఎన్నికల ప్రచారం ముగించుకుని వెళుతున్నవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. అయితే ఆ స్థానానికి ఎన్నిక జరగాల్సి ఉన్నా ఎన్నికల కమిషన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరోవైపు మెదక్ లోక్ సభ స్థానం నుంచి కేసీఆర్ ఎన్నికయిన విషయం తెలిసిందే. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆ స్థానానికి రాజీనామ చేశారు. మరోవైపు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిపిందే. దాంతో ఆ నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడింది. అలాగే గుజరాత్ వడోదరా, యూపీలో అజంగఢ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.