కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకో: రాములమ్మ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గతంలో ఇచ్చిన మాట తప్పారని మెదక్ ఎంపీ విజయశాంతి (రాములమ్మ) మండిపడ్డారు. మాట తప్పడం కేసీఆర్ నైజమని ఆమె గుర్తు చేశారు. ఇచ్చిన మాట మీద నిలబడని కేసీఆర్ రాజకీయాల నుంచి రిటైర్ కావాలని డిమాండ్ చేశారు. గురువారం మెదక్లో స్థానిక అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాములమ్మ గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్పై రాములమ్మ నిప్పులు చెరిగారు.
తాను మెదక్ ఎంపీగా ప్రజలకు కోసం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరకుండా ఆ పార్టీ సీనియర్ నేతలు హరీష్రావు, పద్మా దేవేందర్ రెడ్డిలు అడ్డుకున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో వీధి దీపాలు, నీటీ మోటార్లు ఏర్పాటుకు నిధులు విడుదల చేసిన వాటిని ఆ సదరు నేతలు దుర్వినియోగం చేశారని విమర్శించారు. తాను తెలంగాణ కోసం ఎప్పటి నుంచో పోరాడిన సంగతి ఈ సందర్బంగా రాములమ్మ గుర్తు చేశారు. నిన్నకాక మొన్న పుట్టిన టీఆర్ఎస్ తెలంగాణ కోసం పోరాటాం చేశాననడం విడ్డూరంగా ఉందని రాములమ్మ ఎద్దేవా చేశారు.