పోరు... జోరు
‘అస్త్రాలు’ ప్రయోగిస్తున్న అభ్యర్థులు
ప్రత్యర్థి పార్టీల నాయకులతో బేరసారాలు
అతిరథుల ముమ్మర ప్రచారం
నియోజకవర్గాల్లో మారుతున్న బలాబలాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సార్వత్రిక ఓట్ల పండుగకు ఇంకా తొమ్మిది రోజులు... ప్రచారానికి వారమే మిగిలి ఉండడంతో జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. అన్ని పార్టీల అభ్య ర్థులు ప్రచార జోరును పెంచారు. ఉదయం ఆరు గంటల నుంచే సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాలకు పదునుపెడుతున్నారు... అర్ధరాత్రి వరకు ఇదే పనిలో నిమగ్నమవుతున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది కుటుంబ సమేతంగా పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు.
తాము ఏం చేస్తామనేది చెప్పడం ఎలా ఉన్నా... ప్రత్యర్థి పార్టీలను లక్ష్యంగా చేసుకుని విమర్శల హోరు పెంచారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రత్యర్థులకు దీటుగా డబ్బు, మద్యం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామాల్లో నేతలతో సమన్వయం చేసుకుంటూ సరుకులు సిద్ధం చేసుకుంటున్నారు.
పొద్దంతా ప్రచారంలో నిమగ్నమవుతున్న అభ్యర్థులు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఉదయం వరకు నిద్రహారాలు మాని... సరుకుల సంగతి చూస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు ఎప్పుడు ‘అస్త్రాలు’ బయటికి తీస్తారా అనేది పరస్పరం పరిశీలించుకుంటున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రలోభ పర్వం మొదలైంది. ప్రస్తుతం ప్రత్యర్థి పార్టీల ద్వితీయ శ్రేణి నేతలను ఆకట్టుకునే ప్రక్రియ ఎక్కువగా జరుగుతోంది.
ఇతర నేతల వల...
ప్రతి పోలింగ్ బూత్‌లో తమకు అనుకూలంగా ఓట్లు పడేందుకు అభ్యర్థులు ఏ అవకాశాన్ని వదులుకోవడంలేదు. ప్రస్తుత సర్పంచ్‌లను, సర్పంచ్‌లుగా పోటీ చేసి ఓడిపోయిన వారిని, ఇటీవల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిని ఆకట్టుకునేందుకు తారులాలు ఎర వేస్తున్నారు.ఫిరారుంపులు.. వ్యూహాలతో రోజురోజుకు పార్టీల బలాబలాలు మారిపోతున్నాయి.
ఇలా పోటాపోటీగా నాయకులను చేర్చుకోవడం... వరంగల్ తూర్పు, పాలకుర్తి, జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కువగా జరుగుతోంది. భూపాలపల్లిలో ఇలాంటి మార్పిడి ప్రక్రియ బెడిసికొట్టడంతో ఆగిపోయింది. మిగిలిన నియోజకవర్గాల్లో ఇప్పుడిప్పుడే ఇది మొదలవుతోంది.
నేతల తాకిడి...
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏర్పడే తొలి ప్రభుత్వాన్ని నిర్ణయించే ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రస్తుత ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రతి అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఎన్నికల్లో పోటాపోటీగా ఉన్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ప్రచారంలో జోరు పెంచాయి.
టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ప్రస్తుత ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీకి పట్టున్న జిల్లా కావడంతో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ నెల 17వ తేదీన వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని మడికొండలో బహిరంగ సభ నిర్వహించా వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు అనుకూల వాతావరణం సృష్టించేలా ఈ సభలో కేసీఆర్ ప్రసంగం సాగింది.
అంతేకాకుండా... ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో కేసీఆర్ ప్రచారం చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నెల 22 భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు ఈ నెల 26న పరకాల, నర్సంపేట, స్టేషన్ ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టనున్నారు.
కేసీఆర్ ఇలా ప్రతి సెగ్మెంట్‌లో ప్రచారం చేయడం గతంలో ఎప్పుడూ జరగలేదు.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇటీవల నియూమకమైన పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లా కావడంతో ఈ ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. నామినేషన్ వేసే రోజున జిల్లాకు వచ్చిన పొన్నాల లక్ష్మయ్య... టీఆర్‌ఎస్ అధినేతకు దీటుగా ప్రచారం తీవ్రం చేశారు.
ఆదివారం భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్‌గాంధీ, రాష్ట్రానికి చెందిన ఇతర ముఖ్య నేతలు జిల్లాలో ప్రచారం చేయనున్నారు.
వైఎస్సార్ సీపీ ముఖ్య నేత షర్మిల శనివారం డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించారు. వైఎస్సాఆర్ సీపీ, సీపీఎం అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంతో ఈ రెండు పార్టీల్లో మంచి ఊపు వచ్చింది.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయు డు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రోజున జిల్లా కేంద్రంలో బహిరంగసభ నిర్వహించారు. మళ్లీ జిల్లాలో ప్రచారం చేయడంపై ఇంకా స్పష్టత రాలేదు. టీ టీడీపీ ఎన్నికల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, మరో ముఖ్యనేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఎవరికి వారు సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యూరు.
బీజేపీ వరంగల్ లోక్‌సభ స్థానంలో... భూపాలపల్లి, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేస్తోం ది. ఇప్పటివరకు ముఖ్యనేతలు ఎవరు రాలే దు. రెండుమూడు రోజుల్లో జాతీయ స్థాయి నేతలు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.